సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెట్రో పాలిటన్ నగరం హైదరాబాద్. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా, జీసీసీలకు కేరాఫ్‌గా, దేశానికి భారీ జీఎస్టీలను వసూలు చేయిస్తూ.. అంతర్జాతీయ ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నది ఈ నగరం. ఇంతటి ప్రతిష్టను కలిగిన నగరానికి ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 1000 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుంటే… నగరంలో మాత్రం ప్రణాళికలు జరిగినంత వేగంగా కూడా పట్టాలెక్కింది లేదు. ముఖ్యంగా గడిచిన రెండున్నరేళ్లలో దాదాపు 240 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేస్తామంటూ బీరాలు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం..రెండు అడుగుల మెట్రోకు ఇటుక పేర్చింది లేదు.
దీనికి కాంగ్రెస్-బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలతో… హైదరాబాద్ మెట్రో ఊగిలాడుతుందని, చివరకు హైదరాబాదీలే బలి పశువులుగా మారుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1000 కిలోమీటటర్ల మేర మెట్రో నిర్మాణంలో ఉంటే.. హైదరాబాద్‌లో జీరో స్పీడ్‌తో మెట్రో పనులు సాగుతున్నాయి. దాదాపుగా ఢిల్లీలో 185 కి.మీ, ముంబైలో 141 కి.మీ, బెంగుళూరులో 121 కి.మీ, చెన్నైలో 119కి.మీ. చివరకు పుణే, నాగ్‌పూర్ లాంటి నగరాల్లోనూ మెట్రో నిర్మాణ పనులు రాత్రింబవళ్లు జరుగుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి మెట్రో నిర్మాణాన్ని అపహాస్యం చేసి, చోద్యం చూస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో-2 విస్తరణ విషయంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అనుమతులిచ్చే కేంద్ర ప్రభుత్వం రెండు వేస్తున్న అడుగులు.. హైదరాబాద్ మెట్రో విస్తరణను ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రూట్ మ్యాపులను పక్కనపెట్టి, కొత్తగా ఫ్యూచర్ సిటీ, విమానాశ్రయ రూట్లను మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికల కోసమే ఏడాది సమయం తీసుకున్నది.తీరా అన్ని అనుమతులు ఇవ్వాలంటూ డీపీఆర్‌లను కేంద్రానికి అందజేస్తే… ఇందులో లోపాలు ఉన్నాయంటూ మెట్రో ప్రణాళికలను వేలెత్తి చూపుతోంది.
దాదాపు రూ. 40వేల కోట్లతో ఫేజ్-2 డీపీఆర్‌ను కేంద్రానికి అందజేస్తే.. ప్రకటనలు, ప్రచారానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు, కమిటీలు, నివేదికల కోసమే ఏడాదిన్నర సమయం కేంద్రం వృథా చేసింది. దీంతో క్షేత్ర స్థాయిలో ఈ రెండున్నరేళ్లలో ఒక్క అడుగుకు మెట్రో నిర్మాణం జరగలేదు. ఇక్కడ పక్క రాష్ర్టాలకు ఇచ్చినంత వేగంగా కూడా అనుమతులు రాకపోవడంతో.. తామేమి చేసేది లేదంటూ రాష్ట్ర సర్కారు చేతులెత్తి దిక్కులు చూస్తోంది. అయితే నగరంలో మెట్రో విస్తరణ ప్రణాళికలు పట్టాలెక్కకపోవడానికి రాష్ట్ర సర్కారు వేసిన అంతర్గత లోపాలే కేంద్రానికి అలుసుగా మారాయనే విమర్శలు ఉన్నాయి.
హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు మరో కమిటీని కానీ, సంప్రదింపులను కానీ, ఇరు ప్రభుత్వాలతో భేటీలను నమ్మే స్థితికి చేరుకున్నారు. మెట్రో కనెక్టవిటీలో వెనుకబడి, ఇతర నగరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో వెనుకబాటుతనం.. తెలంగాణ పాలిట శాపంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను మాత్రం పాలకులు ఆసరాగా చేసుకుని పొలిటికల్ బ్లేమ్ గేమ్, క్రెడిట్ రేస్‌లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో నగరవాసులు బలిపీఠమెక్కుతున్నారనే, పీక్ అవర్స్‌లో సౌకర్యవంతమైన ప్రయాణమే కరువైందని సగటు హైదరాబాదీ మదనపడుతున్నాడు.