వెంగళరావునగర్,ఆగస్టు 15: కోరిక తీర్చాలని వివాహితను వేధించాడో కానిస్టేబుల్. కాపాడాల్సిన ఖాకీయే కామాంధుడిగా మారాడు. కాదని నిరాకరిస్తే భర్త, పిల్లల్ని ఖతం చేసేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేయడంతో ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..తిరుమలగిరిలో నివాసం ఉంటున్న మహిళ పక్కింట్లో రాజ్ భవన్లో డ్యూటీ చేసే హెడ్ కార్టర్స్ కు చెందిన ఏ.ఆర్.కానిస్టేబుల్ ఎం.వెంకటేష్(35) ఉండేవాడు.
గత నాలుగేళ్లుగా ఆమెతో అతనికి పరిచయం ఉంది. ఏడాది కాలం నుంచి కోరిక తీర్చాలంటూ ఆమెని కానిస్టేబుల్ వెంకటేష్ వేధించసాగాడు. ఇంట్లో గొడవలు ఆవుతాయనుకుని విషయం భర్తకు చెప్పకుండా దాచింది. గురువారం తన పిల్లల్ని వెంటబెట్టుకుని బల్కంపేట్లోని పుట్టింటికి వచ్చింది. ఆమె ఇంట్లోకి జొరబడి చేయి పట్టుకుని తన వెంటరావాలని వేధింపులకు దిగాడు. తన కోరిక తీర్చకపోతే నీ భర్తతో పాటు..పిల్లల్ని కూడా చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధిత మహిళ ఆ కానిస్టేబుల్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.