అడ్డగుట్ట, ఆగస్టు 5 : సస్పెండ్ అయ్యాననే మనోవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ అనుదీప్ కథనం ప్రకారం… రాణిగంజ్ ప్రాంతానికి చెందిన కిరణ్ బాబు(37) 2009 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్. ఇతనికి భార్య సారిక, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కిరణ్ కుల్సుంపురా, మీర్‌చౌక్, మార్కెట్‌తోపాటు పలు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించా డు.
అయితే కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతన్ని సస్పెండ్ చేశారు. అనంతరం ఎంక్వైయిర్లో కూడా అతను అవకతవకలకు పాల్పడ్డాడని తేలడంతో.. కిరణ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు కూడా ఓవరాల్ ఎంక్వైయిర్ని అంగీకరించి.. అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కిరణ్ కుటుంబ పోషణ నిమిత్తం కొన్నిరోజులు ర్యాపిడో బైక్ నడిపించాడు.
ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు లోనై మంగళవారం శ్రీనివాస్ నగర్‌లోని వాళ్ల అత్తమ్మ ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచా రం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కిరణ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.