హైదరాబాద్ మహా నగరానికి రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు వస్తున్నాయి. అంటే ఏడాదికి 16.5 టీఎంసీలు. మరి… ఈ జలాలను తీసుకునే జలాశయం (సోర్స్) అక్కంపల్లి రిజర్వాయర్ సామర్థ్యం ఒకటిన్నర టీఎంసీలు. ఇదే నగరానికి రెండో దశ గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కొండపోచమ్మ జలాశయం నుంచి డిజైన్, ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ రేవంత్ సర్కారు వచ్చి దానిని మల్లన్నసాగర్‌కు మార్చింది. తద్వారా పథకం వ్యయం కనీసంగా రూ.2వేల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. ఇదేమంటే… కొండపోచమ్మ సామర్థ్యం 15 టీఎంసీలైతే, మల్లన్నసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు కదా.. అంటున్నది.
Musi | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వాస్తవానికి మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తాయి. రెండు జలాశయాల కింద భారీ ఆయకట్టు ఉన్నందున మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటి ఎత్తిపోత అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం కోసం చేయాల్సిన పని లేదు. పైగా నగర నీటి సరఫరాతో మూసీ ప్రక్షాళన కోసం రోజు వారీగా తీసుకునేందుకు కావాల్సిన నీటి పరిమాణం కేవలం 500-600 క్యూసెక్కులు మాత్రమే.
అందుకే పథకం డిజైన్ మార్పు వెనక మర్మం దాగి ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కారుపై ఆరోపణల అస్త్రం సంధించారు. దీంతో ప్రభుత్వం తాజాగా వ్యాప్కోస్ సర్వేను తెరపైకి తీసుకువచ్చింది. ఈ రెండు జలాశయాలతో పాటు మొదటి దశలో భాగంగా ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపు మార్గాన్ని కూడా ఇందులో చేర్చి సర్వేను మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో ఇదే వ్యాప్కోస్ సర్వే చేయగా… రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అదే సంస్థతో సర్వే చేయించడం గమనార్హం.
మూసీ సుందరీకరణ కోసమంటూ నిరుపేదల ఇండ్లను ఎడాపెడా కూల్చివేసిన రేవంత్ సర్కారు.. మూసీ ప్రక్షాళన కోసం గోదావరి జలాల తరలింపు పథకంపై మాత్రం సర్వేల బాట పడుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి రెండో దశ గోదావరి జలాల తరలింపు పథకంతో మూసీ ప్రక్షాళన ముడిపడి ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ సాగర్ నుంచి జలాల తరలింపు ఆధారంగా పథకాన్ని రూపొందించింది. ఇందులో హైదరాబాద్ నగరానికి ఏటా 10 టీఎంసీల జలాల తరలింపు పథకానికి కేవలం రూ.1100 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని తేల్చారు.
దీంతో పాటు రావిల్కోట్ చెరువు నుంచి 52 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా అదనంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు చెరో మూడున్నర టీఎంసీలను తరలించే డిజైన్ కూడా పూర్తయింది. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే కేసీఆర్ ప్రభుత్వం 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వలో 27వ కిలోమీటర్ వద్ద చానెల్‌ను కూడా నిర్మించింది. ఈ పథకంలో దాదాపు గ్రావిటీపైనే గోదావరి జలాల తరలింపు జరగడంతో పాటు కేవలం 24 కిలోమీటర్ల దూరంతోనే జలాలు నగర శివారులోకి వస్తాయి. వాస్తవానికి గతంలో వ్యాప్కోస్ సంస్థనే వీటిపై సర్వే చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కూడా సమర్పించింది.
ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొండపోచమ్మ కాకుండా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కొంతకాలం కిందట రూ. 5560 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వ్యాప్కోస్ సంస్థ నివేదిక ప్రకారమే ఈ పథకాన్ని రూపొందించినట్లు అందులో పేర్కొన్నారు.
కొండపోచమ్మ సామర్థ్యం కంటే మల్లన్నసాగర్ నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో డిజైన్ మార్పుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పైప్‌లైన్ పొడవు ఏకంగా 25-30 కిలోమీటర్ల మేర పెరుగుతుందని, కేవలం దీని కోసమే డిజైన్ మార్చి సుమారు రూ.2వేల కోట్ల అదనపు భారాన్ని ఎత్తుకున్నారనే విమర్శలు వినిపించాయి. అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకే డిజైన్ మార్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఆరోపణలు చేశారు.
గోదావరి జలాల తరలింపు పథకానికి గత నవంబర్లోనే టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేశారు. కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్ సమీక్ష సమావేశంలోనూ డిసెంబర్ మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు జలమండలి ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా మళ్లీ ఈ పథకంపై వ్యాప్కోస్ సర్వేను తెరపైకి తెచ్చారు. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, ఎల్లంపల్లి… ఈ మూడు మార్గాల్లో సర్వే చేసి, దేని ద్వారా సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయనే దానిపై నివేదిక రూపొందించేందుకు ఈ సర్వే చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
అసలు గతంలోనే వ్యాప్కోస్ సర్వే చేసి ఇచ్చిన నివేదికలున్నాయి. మళ్లీ కొత్తగా సర్వే ఎందుకు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మల్లన్నసాగర్ డిజైన్‌ను ఖరారు చేసేందుకే ఈ డ్రామా మొదలుపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాప్కోస్ తాజాగా చేసిన సర్వేలో మల్లన్నసాగర్ ద్వారానే చేపట్టాలని సూచించిందనే సిఫార్సు ఉంటుందని, దాని ఆధారంగానే తాము ముందుకువెళ్లామనే కారణాన్ని చూపేందుకే సర్వే చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అంటే అసలే రూ. 2వేల కోట్ల అదనపు భారం అనే ఆరోపణలు వస్తుండగా… వ్యాప్కోస్ సర్వేకు మరిన్ని కోట్లు అదనపు ఖర్చు కానుండటం కొసమెరుపు.