సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): నగరంలో ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీ అనేది పరిహాసంగా మారింది. ప్రధాన మార్గాల గుండా పోతున్న మెట్రోను.. కాలనీలు, ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఫీడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలను తీసుకువచ్చే కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. మెట్రో జర్నీ చేసి ఇంటికి చేరుకునేందుకు అనువైన రవాణా సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సొంత వాహనాలు, ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి.
మెట్రో స్టేషన్ల నుంచి సమీప దూరంలో ఉండే గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేందుకు వీలుగా మెట్రో సంస్థ ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో ప్రధానమైనవి నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మార్గాలే.. కాగా ఈ రెండు కారిడార్లలో నిత్యం 3.5లక్షల మందికి పైగానే రాకపోకలు సాగిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎల్అండ్టీ-హెచ్ఎంఆర్ఎల్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను కల్పించాల్సి ఉన్నా… పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నగరంలో ప్రస్తుతం ఓలా, ఉబెర్, సువిధ, మెట్రో రైడ్, ఆర్టీసీ వంటి సంస్థలతో మెట్రో స్టేషన్లకు కనెక్టవిటీ కేవలం మొత్తం స్టేషన్లలలో 20శాతం లోపే ఉంది. మిగిలిన స్టేషన్ల పరిసరాల్లో ఉండే వారంతా సొంత వాహనాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో ఛార్జీలతోపాటు అదనంగా స్టేషన్లకు చేరుకునేందుకు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం నగరంలో రెండు కారిడార్లలో 67 మార్గాల్లో ఈ సదుపాయం కల్పిస్తుండగా… ప్రయాణికుడిపై రూ.15-40 వరకు భారం పడుతోంది.
కొన్ని సందర్భాల్లో ఫీడర్ సదుపాయాల్లో కలిగే అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లాలాపేట్లోనివాసం ఉండే శ్రీనివాస్ పేర్కొన్నారు. తాను నిత్యం రాయదుర్గం-తార్నాక వరకు జర్నీ చేస్తుండగా, తార్నాక స్టేషన్కు చేరుకునేందుకు, అక్కడి నుంచి రాయదుర్గం నుంచి కార్యాలయానికి వెళ్లేందుకు మరోసారి ఆటో లేదా రాపిడో వంటి బైక్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని వివరించారు. ప్రయాణికులపై భారం పడకుండా మెట్రో.. ఎల్ అండ్ టీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసినైట్లెతే ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు, అదనపు ఖర్చులు తగ్గుతాయని మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు.