బండ్లగూడ, ఏప్రిల్ 04: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు విమర్శించారు. విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మూసీ బాధితులకు అండగా నిలువనున్నారు. శనివారం ఆయన బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మూసీ సమస్యలపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్ను అవిష్కరించారు. యువ నాయకులతో కలిసి పోరు బాట ప్రారంభించి హైదర్షాకోట్, సాయిరాంనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పక్కన బెట్టి కోట్లాది రూపాయాల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కుట్ర జరుగుతోందని అరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో అనేక మంది నిరుపేదల ఇండ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల జోలికి పోకుండా మూసీ సుందరీకరణ ఏ విధంగా చేయవచ్చో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాగోల్ ప్రాంతంలో చేసి చూపించిందన్నారు. ఇప్పడు కూడా ఇండ్లను కూల్చకుండా అభివృద్ధి పనులను చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం నుంచి రోజూ పాదయాత్రగా మూసీ బాధితుల ఇండ్లకు వెళ్తామన్నారు. ప్రభుత్వం ఇండ్లను కూల్చడం ఆపకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.