సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 6: గ్రేటర్ కాంగ్రెస్‌లో రోజుకో రీతిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్..నాన్ లోకల్ అంశం చివరకు పరిస్థితులు రక్తచర్రితకు దారులు తీస్తున్నాయి. సోమవారం కూకట్పల్లి అభ్యర్థి బండి రమేశ్‌కు మద్దతుగా జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.
సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పాల్గొన్న సమావేశంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. బల్లలు చెల్లాచెదురు చేశారు. ఒకరినొకరు గల్లాలు పట్టుకొని పిడిగుద్దుల వర్షం కురిపించారు. చివరకు కొందరి కార్యకర్తల తలలు పగిలి రక్తాన్ని చిందించారు. కూకట్పల్లి ఎన్కెఎన్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లూరవి ముఖ్య అతిథులుగా హాజరుకాగా.. నియోజకవర్గంలోని ఆయా డివిజ్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ అధిష్ఠాన నేతలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని ఓవైపు పిలుపునిస్తుండగానే.. మరోవైపు నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల కొట్లాట శబ్దాలు అధినేతల చెవికి చేరుకున్నాయి. సమావేశంలోనే బాలాజీనగర్, బోయిన్పల్లి డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
ఈ కొట్లాటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి గాయాలతో పాటు రక్తస్రావం అయింది. వెంటనే నేతలు అక్కడినుంచి పారిపోగా.. కిందిస్థాయి నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు మామూలేనని సదరు కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారు.
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అడుగడుగునా ఎదురుగాలి వీస్తున్నది.. పార్టీమారి ఊరుకాని ఊరులో టికెట్ తీసుకోగానే.. కూకట్‌పల్లిలో 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తనవెంట తీసుకెళ్లాడు. బాలానగర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన రోజే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యం శ్రీరంగం, యుగేంధర్‌రెడ్డి ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ఇన్నాళ్లు కష్టపడ్డ వారిని పట్టించుకోకుండా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కొత్తగా వచ్చిన నేతలు హడావిడి చేయడం ఏంటంటూ కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
కూకట్‌పల్లిలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఐక్యత లేని నేతల తీరు అర్థంకాక.. బండి రమేశ్ తలపట్టుకుని ప్రచారం ఎలా చేయాలిరా నాయనా.. అనుకుంటూ బాధపడిన దుస్థితి… ఏరికోరి తెచ్చుకున్న టికెట్ కాబట్టి.. ఎన్నికల వరకైనా ఏదోవిధంగా ప్రచారం చేయాలన్న తలంపుతో రోజువారీ అడ్డా కూలీలను మాట్లాడుకుని.. రోజూ తనవెంట ప్రచారం కోసం తిరగాలని.. కాంగ్రెస్ జెండాలను కూలీలకు అప్పగించాడు. కూలీ పైసలు ఇవ్వగానే వారు ఇంటిబాట పడుతుండటంతో ప్రచారాన్ని ఆపేసి తానుకూడా ఇంటికి చేరుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసిరాక పోవడం.. స్థానికులెవ్వరూ అంతగా పరిచయం లేకపోవడంతో రోడ్లవెంట తిరుగుతూ ప్రచారం చేస్తుండటంతో శ్రేణులు విస్మయం చెందుతున్నారు.