బంజారాహిల్స్,అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లచోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. సోమవారం యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆర్వోలతో కూడిన బృందం వివరాలు సేకరించారు. ఓటర్ జాబితాలోని 1006నుంచి 1048 నెంబర్ కలిగిన ఓటర్లలో ఇద్దరు మాత్రమే అపార్ట్మెంట్లో ఉంటున్నారని తేలింది. ఐదు ఫ్లోర్లలోని ఈ అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లు ఉండగా మూడు ప్లాట్లు ఖాళీ ఉన్నాయని గుర్తించారు. మరో 12 ఫ్లాట్లలోని వారిని కలిసిన ఎన్నికల సంఘం అధికారులు వివరాలను సేకరించారు. ఫ్లాట్ నెంబర్ 101లో నివాసం ఉంటున్న మూగ్గురు వ్యక్తులు కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన వారని తేలింది. తమకి సొంతూర్లోనే ఓట్లున్నాయని పేర్కొన్నారు.
ప్లాట్ నెంబర్ 102, 103లలో ఉంటున్న రెండు కుటుంబాల్లో కలిపి నలుగురు ఉన్నారని, వారికి కూడా సొంతూర్లలో ఓట్లున్నాయని గుర్తించారు. 201 ఫ్లాట్‌లో ఉంటున్న కుటుంబంలోని నలుగురికి విజయవాడలో మాత్రమే ఓట్లున్నాయని, కృష్ణానగర్‌లో ఓట్లు లేవని తేలింది. ఫ్లాట్ నెంబర్ 202లోని అద్దెకు ఉంటున్నవారికి వైజాగ్‌లో ఓట్లున్నాయని, ఇక్కడ తమకు ఓట్లు లేవని పేర్కొన్నారు. ఫ్లాట్ నెంబర్ 203లో భార్యాభర్తలున్నారని, తమకు వేరే నియోజకవర్గంలో ఓట్లున్నాయని ఇక్కడ దరఖాస్తు చేసుకోలేదని తేలింది. 302 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలకు రాజమండ్రిలో మాత్రమే ఓట్లున్నాయని ఇక్కడ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు.
ఫ్లాట్ నెంబర్ 401లో నివాసం ఉంటున్న రామకృష్ణ,అతడి సతీమణి మాత్రం ఆరునెలల క్రితం ఇక్కడకు ఓట్లను మార్చుకున్నారని గుర్తించారు.402లో భార్యాభర్తలు ఉండగా ఒకరికి మాత్రం ఓటు ఉందని తేలింది. 403లో ఉంటున్న వారికి కృష్ణానగర్ ఏ బ్లాక్‌లో ఓట్లున్నాయని, అక్కడకు వెళ్లే తాము ఓట్లు వేస్తారని తేలింది. ఫ్లాట్ నెంబర్ 501 కట్టిప్పటినుంచి ఖాళీగా ఉందని గుర్తించారు. ఫ్లాట్‌నెంబర్ 502లోని భార్యాభర్తల్లో భార్యకు మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు ఉందని, 503లో ఎవరికీ ఓట్లు లేవని తేలింది. మొత్తం సంస్కృతి ఎవెన్యూ పేరుతో ఓటర్ జాబితాలో ఉన్న 44 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే నివాసం ఉంటున్నారని, మిగిలిన వారు ఎవరో తమకు తెలియదని అపార్ట్మెంట్ వాసులు తేల్చారు.
దీంతో పాటు స్థానిక కాంగ్రెస్ నేత మంగళారపు మల్లికార్జున్ యాదవ్, అతడి సోదరుడైన రౌడీషీటర్ మంగళారపు అర్జున్ యాదవ్‌కు చెందిన ఇంటి నెంబర్ 118 పేరుతో ఓటర్ జాబితాలో 49 ఓటర్లు ఉండగా, వారిలో మల్లికార్జున్ యాదవ్ కుటుంబానికి చెందిన నలుగురు ఓటర్లతో పాటు నలుగురైదుగురు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ ఉండడం లేదని, వారిపేరుతో బోగస్ ఓట్లు తయారు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. జీ ప్లస్ 3 భవనంలో రెండు ఫ్లోర్లలో హాస్టల్ నడుస్తోందని తేలింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులు విచారించగా, తమ ఇంటిపేరుతో అదనంగా ఓట్లు ఎలా వచ్చాయో తెలియదంటూ మల్లికార్జున్ యాదవ్ పేర్కొన్నట్లు తేలింది.
ఇదిలా ఉండగా ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద భారీగా ఆరోపణలు రావడంతో జాతీయ స్థాయిలో పరువుపోయే పరిస్థితి ఏర్పడడంతో తన బాకా పత్రికలను రంగంలోకి దించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ఇండ్లలో కాంగ్రెస్ నేతలు లెక్కకు మించి దొంగ ఓట్లను చేర్చారని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టడంతో దిక్కుతోచని ప్రభుత్వ పెద్దలు సొంతపార్టీకి చెందిన పత్రికల ద్వారా అసలేమీ జరగలేదని నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల సంఘానికి చెందిన క్షేత్రస్థాయి అధికారులు వెళ్లి ఇంటినెంబర్ 160 పేరుతో ఓటర్ జాబితాలో ఉన్న 44 ఓటర్లలో 42మంది అక్కడ ఎప్పుడూ లేరని తేల్చారు.
అయితే జిల్లా ఎన్నికల అధికారి ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టు ప్రకారం 2023 డిసెంబర్ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంటి నెంబర్ 160 పేరుతో ఓటర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే అక్కడున్న నివాసితులకు తెలియకుండానే 42మంది పేర్లు జాబితాలో ఉన్నాయని తేలినా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా 5 అంతస్తుల భవనంలో 15 ఫ్లాట్స్ ఉన్నాయని, దానిలో 44మంది ఓటర్లు ఉండడం సహజమేనని ప్రకటించడం అనుమానాలకు దారితీస్తోంది. ఎన్నికల అధికారి పెట్టిన పోస్ట్ తర్వాత తెలంగాణలోని ఓ మంత్రికి చెందిన బాకా పత్రిక ద్వారా ‘15 ఫ్లాట్లు ..43ఓట్లు’ అంటూ అర్థసత్యాలను ప్రచారం చేయడం విశేషం. సదరు అపార్ట్మెంట్లో ఏకంగా 42 దొంగ ఓట్లున్నాయని తేలిన తర్వాత వాటిపై చర్యలు తీసుకోవడం మానేసి అసలేమీ జరగలేదనే దోరణిలో వార్తలను వండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న నవీన్ యాదవ్ 2014నుంచి రాజకీయాల్లో ఉన్నాడని, అప్పటినుంచి రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. 2018, 2023 ఎన్నికల్లో సైతం నవీన్ యాదవ్ పోటీ చేసేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించాడని తెలుస్తోంది. కృష్ణానగర్ బీ బ్లాక్‌లోని ప్లాట్ నెం 160లో గతంలో ఉన్న ఇంటిని పడగొట్టి ఏడాదిన్నన క్రితం కొత్త అపార్ట్మెంట్ వెలిసింది. దీంతో పాటు ప్లాట్ నెం 118లోని ఇల్లు కూడా నవీన్ యాదవ్ సన్నిహితుడిగా ఉన్న మల్లికార్జున్‌యాదవ్ కుటుంబానికి చెందినవే అని స్థానికులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాల్సి ఉండగా, జిల్లా ఎన్నికల అధికారి తన ట్విట్టర్ ఖాతాలో విచారణ దశలోనే క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం.