బంజారాహిల్స్, అక్టోబర్ 31: ‘సీఎం రేవంత్‌రెడ్డి మీటింగ్‌కు రాకపోతే షూటింగ్స్‌లో అవకాశం ఇవ్వం.. షూటింగ్స్ ఆపేస్తాం.. సాకులు చెబితే ఊరుకోం, మీటింగ్‌కు ఎవరెవరు రాలేదో వారి పేర్లు నోట్ చేసుకుంటాం, అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించినా నాలుగురోజుల కింద యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అభినందన సభకు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు హాజరుకాకపోవడంతో సభ అట్టర్ ప్లాప్ అయింది. 10వేల మందికి పైగా సభ్యులు కలిగిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నిర్వహించిన సీఎం సభకు కనీసం వెయ్యిమంది కూడా సినీ కార్మికులు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పెద్దలతో పాటు సీఎం శిబిరంలో సైతం అలజడిని సృష్టించింది.
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చేసిన అవినీతి కార్యక్రమాలు, వేతనాల పెంపు విషయంలో చేసిన మోసాన్ని గుర్తించిన సినీ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయింది. సినీ కార్మికులకు ఆరోగ్య బీమా కింద రూ.5 లక్షలు ఇస్తారని, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తారంటూ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టడంతో పాటు వెంటనే అన్ని యూనియన్లకు చెందిన కార్మికులకు చెందిన వివరాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. లేకుంటే తర్వాతి పరిణామాలకు మీరే బాధ్యులు అంటూ ఆడియో సందేశాలు పెట్టారు. ఆరోగ్య బీమా పేరుతో డ్రామాకు తెరతీశారని సినీ కార్మికులు ఆరోపిస్తున్నారు.