సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరానికి కీలకమైన డబు ల్ డెక్కర్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకే రీతి ప్రాజెక్టు విషయంలో భిన్నమైన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మార్గంలో డబుల్ డెక్కర్‌కు జై కొడుతూ… మరోవైపు నార్త్ సిటీ కారిడార్ విషయంలో విముఖత వ్యక్తం చేస్తోంది. దీనిపై రాజకీయంగానే కాకుండా సామాజికంగా, ప్రాంతీయంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పు హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. దీనికోసం చకచకా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కార్.. ఒకే భూసేకరణతో నిర్మాణ భారం కూడా తగ్గుతుందని అంచనా వేసింది. అయితే ఇక్కడ సాధ్యమైన భూసేకరణ, డబుల్ డెక్కర్ నిర్మాణ టెక్నికల్ సమస్యలు.. నార్త్ సిటీ డబుల్ డెక్కర్ విషయంలో ఎందుకు తెరమీదకు తీసుకువచ్చిందనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ప్యారడైజ్ నుంచి సుచిత్ర, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో ప్రతిపాదించిన నార్త్ డబుల్ డెక్కర్ ప్రాజెక్టును మాత్రం రక్షణ శాఖ భూములు, భూసేకరణ ఇబ్బందులు, సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ ఈ మార్గంలో డబుల్ డెక్కర్ నిర్మించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంటున్నది. అధునాతన ఇంజినీరింగ్ సాంకేతికత అందుబాటులో ఉన్న తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన మలుపుల్లో కూడా డబుల్ డెక్కర్ నిర్మాణాలు జరుగుతుంటే, కేవలం ఇక్కడే ఎందుకు అసాధ్యమని కాంగ్రెస్ సర్కార్ తీరును ప్రశ్నిస్తున్నారు. అయితే ఎల్బీనగర్లో ఓకే అన్నా సర్కార్.. నార్త్ సిటీలో నాట్ ఓకే చెప్పడం వెనుక ప్రజల్లో అయోమయానికి దారితీస్తోంది.