సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఉట్టికి కోడిని కట్టి కూరలేని అన్నం తింటూ.. చికెన్ పలావు తిన్నట్లుగా ఊహించుకోండి! అని అంటే ఎలా ఉంటుంది? ఆదివారంతో గడువు ముగియనున్న పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాలకు చివరి దశలో రాష్ట్ర సర్కారు ఝలక్ ఇచ్చింది. ఆయా స్థానిక సంస్థల ఖాజానాకు నిధులు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి, ఇతర పనుల కోసం వినియోగించడంపై మాత్రం ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.
దీంతో ఖజానాలో భారీ నిధులున్నా.. చివరి నిమిషంలో వాడుకునేందుకు అవకాశం లేకపోవడంతో పాలకవర్గాలు నీరుగారిపోయాయి. కొన్ని కార్పొరేషన్లలోనైతే ఏకంగా ఈ నిధుల మీద ఆశతో ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి మరీ హడావిడిగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు తీర్మానం కూడా చేసుకున్నారు. తీరా… అధికారులతో ఖజానాపై వాకబు చేయించుకుంటే ఆ నిధులను ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ కోసం మాత్రమే వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది… ఉట్టి మీద కోట్ల రూపాయలున్నా.. బిల్లులకు మోక్షం కలగకపాయె! అని పాలకవర్గాలు చిన్నబుచ్చుకున్నాయి.
ప్రజాప్రతినిధులంటే పదవీ కాలం ఐదేండ్లు. మరి పదవీ కాలం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో ఆయా ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత మేర ఎక్కువ అభివృద్ధి పనులు చేసుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లోనైతే సర్వసభ్య సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఈ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కోట్లల్లో పారుతాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గం పదవీకాలం ఆదివారంతో ముగుస్తుంది. అందుకే గత కొన్నిరోజులుగా నగర శివారుల్లోని కార్పొరేషన్లలోని పాలకవర్గాలు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు తీర్మానం చేశాయి. గతంలోని పనులకు చకచకా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ముగిసేలా జాగ్రత్తపడ్డాయి. ఇలా చాలా కార్పొరేషన్లలో ఖజానాలో నిధులు లేకున్నా.. కోట్లాది రూపాయల ప్రతిపాదనలకు తీర్మానాలు చేసుకొని హడావిడిగా ప్రారంభోత్సవాలు చేశారు. అయితే గత కొన్నిరోజుల కిందట ఊహించనిరీతిలో ఈ కార్పొరేషన్లకు ఒక్కసారిగా నిధులు వచ్చిపడటంతో పాలకవర్గాల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా స్టాంపు, రిజిస్ట్రేషన్ శాఖపరంగా జరిగే భూ క్రయ, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం వసూలు చేసే స్టాంప్ డ్యూటీలో 0.5 శాతం ఆయా స్థానిక సంస్థలకు వెళ్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాకుండా తరచూ ఒకేసారి ఈ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల7న రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు స్టాంపు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సుంకం కింద ప్రభుత్వం రూ.2,694.75 కోట్లు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిల్లో భాగంగా నగరం చుట్టూ ఉన్న కీలకమైన నిజాంపేట, బడంగ్‌పేట, మీర్‌పేట, బండ్లగూడ, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ వంటి ఏడు కార్పొరేషన్లకు సుమారు రూ.460 కోట్ల వరకు నిధులు బదిలీ అయ్యాయి.
దీంతో ఆయా పాలకవర్గాల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఆదివారంతో పదవీకాలం ముగుస్తున్నందున చాలాచోట్ల కొన్నిరోజులకు ముందే సర్వసభ్య సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు తీర్మానం చేసుకున్నారు. ఖజానాలో చిల్లిగవ్వ లేకున్నా సరే.. రూ.30-40 కోట్లకు తీర్మానాలు జరిగిన కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. బడంగ్‌పేట కార్పొరేషన్ పాలకవర్గం ఒకడుగు ముందుకేసి రెండు రోజుల కిందట కూడా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి కోట్లాది రూపాయల ప్రతిపాదనలకు తీర్మానం చేసుకోవడం కొసమెరుపు.
స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సుంకం కింద బదిలీ అయిన నిధులతో కొన్ని కొత్త అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు మోక్షం కల్పించుకోవడంతో పాటు పెండింగ్ బిల్లులను పెద్ద ఎత్తున మంజూరు చేయించుకునేందుకు పాలకవర్గాలు భారీ ఎత్తున పావులు కదిపాయి. నగరం చుట్టూ ఉన్న ఏడు కార్పొరేషన్లనే తీసుకుంటే.. బడంగ్‌పేట-రూ.89.87 కోట్లు, బండ్లగూడ-రూ.96.73 కోట్లు, బోడుప్పల్-రూ.45.07 కోట్లు, పీర్జాదిగూడ-రూ.40.38 కోట్లు, మీర్‌పేట-రూ.17.74 కోట్లు, జవహర్‌నగర్-1.50 కోట్లు, నిజాంపేట-169 కోట్లు నిధులు బదిలీ అయ్యాయి. ఎలాగూ ఇంత భారీమొత్తంలో నిధులు వచ్చినందున బిల్లులను డ్రా చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నం చేశారు.
కానీ ఈ పరిణామాన్ని సర్కారు ముందుగానే ఊహించింది. అందుకే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించింది. ఈ నిధుల నుంచి ఒక్క పైసా కూడా అభివృద్ధి పనులకు విడుదల చేయవద్దని, వాటికి తర్వాత నిధులు ఇస్తామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులను కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల పెండింగ్ ఈఎస్ఐ, ఈపీఎఫ్, సీసీ చార్జీల చెల్లింపు, జీఎస్టీ, ఐటీ వంటి చెల్లింపులకు మాత్రమే వినియోగించాలని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో పాలకవర్గాల గొంతులో వెలక్కాయపడిన పరిస్థితి. ఇక్కడే కాదు రాష్ట్రవ్యాప్తంగానూ పట్టణ స్థానిక సంస్థల పరిస్థితి ఇలానే ఉన్నప్పటికీ.. నగరానికి ఆనుకొని ఉన్న కార్పొరేషన్లు అయినందున ఇక్కడ భారీ మొత్తంలో నిధులు ఉన్నా చివరి నిమిషంలో వాటిని వాడుకోలేని విషమ పరిస్థితిలో పాలకవర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.