సిటీబ్యూరో : గ్రేటర్ విస్తరణ… అడ్డగోలుగా వార్డుల పునర్విభజన… పౌర సేవల్లో అనేక క్షేత్ర స్థాయి ఇబ్బందులు… సర్కారు సహా అధికార యంత్రాంగం వీటన్నింటినీ అటకె క్కించింది… ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన జోన్లు, సర్కిళ్లలో కొత్త పోస్టుల కోసం పైర వీలు మొదలయ్యాయి… రెండు రోజుల కిందట రాత్రి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిందో లేదో.. ‘ఉదయ’మే పైరవీల జోరు మొదలైంది. ‘ముఖ్య’నేత అనుచరుడు, పురపాలక శాఖలో షాడో సీఎంగా వ్యవహ రించే నేత రంగంలోకి దిగారు. పోస్టులను బట్టి రేటు… ఏరియాను బట్టి ధర… అన్నట్లు దుకాణం తెరిచారు.. ఇంకేముంది.. జమ్మయ్య, జక్కయ్య క్యూ కట్టారు. దీంతో నూతన జోన్లు, సర్కిళ్లలో పోస్టుల భర్తీని ముందు వేసుకున్న కమిషనర్ ఈ పైరవీలతో బేజారవుతున్నట్లు తెలిసింది.
బృహత్ హైదరాబాద్ నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీలో ఇప్పుడు ‘పోస్టింగ్’ల పర్వం ఊపందుకున్నది. ఒకవైపు పైరవీలు నడుస్తుంటే మరోవైపు విలీనమైన డివిజన్లలో సామాన్య ప్రజలు సేవలు అందక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే కీలక పోస్టుల్లో పైరవీలతో వచ్చిన వారు ప్రజల సమస్యల కంటే డబ్బు వైపు మొగ్గు చూపుతారంటూ పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీంతో వికేంద్రీకరణ ఫలితాలు అందకపోగా, అవినీతి వికేంద్రీకరణ జరిగే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది. పోస్టులను భర్తీ చేసే సమయంలో పారదర్శకత లోపించడంతో నిజాయితీగా పనిచేసే అధికారులకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వికేంద్రీకరణను అసరాగా చేసుకున్న ‘ముఖ్య’నేతల అనుచరులు, కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ‘కొత్త’ కొలువులకు పైరవీల తలపులు తెరిచారు..12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో రెట్టింతలు పెరిగిన జీహెచ్ఎంసీలో కీలకమైన పోస్టులు దక్కాలంటే అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆశీస్సులు ఉంటేనే కోరుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం ముందుగా నడిపించి…ఇందుకు పైరవీ దందాకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం కొత్తగా ఏర్పడిన జోన్లలో జోనల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించగా, రెండో ప్రాధాన్యత గల పోస్టింగ్‌లను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. కీలకమైన కుర్చీ దక్కించుకోవడానికి ఏకంగా లక్షల్లో బేరసారాలు సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్తగా ఏర్పడిన 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను నియమించాల్సి ఉంది. ఈ పోస్టుల భర్తీపై కమిషనర్ కర్ణన్ కసరత్తు చేస్తున్న తరుణంలోనే కొందరు ‘ముఖ్య’ నేతలు, కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ పోస్టింగ్‌ల భర్తీలో తలదూర్చినట్లు ప్రచారం సాగుతున్నది. చందానగర్‌లో పనిచేసిన ఓ వివాదస్పదమైన డీసీ ఐటీ కారిడార్‌లో కీలకమైన పోస్టింగ్ కోసం ‘ముఖ్య’ నేతను ఆశ్రయించినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. వివాదాస్పదమైన ఓ డీసీ (ఉద్యమ నేత అని చెప్పుకొనే అధికారి) వెస్ట్ కారిడార్‌లో పోస్టింగ్ కోసం ఓ జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసినట్లు ప్రచారం ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ పోస్టుల భర్తీ ఉండడంతో పైరవీ చేసుకున్నవారికి పోస్టింగ్ మారడం, ముఖ్యంగా ఐటీ కారిడార్, కమర్షియల్ జోన్లలో పోస్టింగ్ కోసం తీవ్రంగా పోటీ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
కొత్తగా ఏర్పడిన జోనల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ), డిప్యూటీ కమిషనర్ (డీసీ) స్థాయి పోస్టుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఐతే వాస్తవంగా డిప్యూటీ కమిషనర్ల (డీసీ) భర్తీలో ప్రాయర్టీ పరంగా చూస్తే తొలుత సెలక్షన్ గ్రేడ్, ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్, ఆనంతరం గ్రేడ్-1, గ్రేడ్-2లను ప్రాధాన్యత పరంగా డీసీల పోస్టింగ్‌లు ఇవ్వాలి..కానీ ఇప్పటికే కూకట్పల్లి జోన్లో గ్రేడ్-1 అధికారిని ఏఎంసీగా, గ్రేడ్-2 అధికారిని డీసీ స్థాయి పోస్టింగ్ ఇచ్చారు. అర్హత విషయంలో హోదా కంటే తక్కువ ఉన్న అధికారి వద్ద గ్రేడ్-1 అధికారి పనిచేస్తుండడం గమనార్హం. ఇదే అదనుగా భావించిన కొందరు తక్కువ క్యాడర్ అయిన గ్రేడ్-3 అధికారులు పైరవీల బాట పట్టారు. ఏకంగా ఆదాయం ఎక్కువగా ఉండే సర్కిళ్లలో పోస్టింగ్ దక్కించుకుంటే ‘అన్నీ’ సమకూరుతాయన్న ఆశతో కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల ఇండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలనుకుంటున్నా పైస్థాయి నుంచి వస్తున్న ‘సిఫార్సు లేఖలు’ వారి చేతులను కట్టేస్తున్నాయి.
ఎక్కువ శాతం గ్రేడ్ -3 అధికారులు డీసీ పోస్టులకు అడ్డదారిలో వస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవంగా జీహెచ్ఎంసీలో గ్రేడ్-3 మున్సిపల్ అధికారులకు డీసీలకు చేసే అర్హత లేదన్నది సుస్పష్టం..స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన అధికారులు మాత్రమే డీసీ పోస్టింగ్‌కు అర్హత. కానీ కొత్తగా ఏర్పడిన సర్కిళ్లలో ఉన్నతాధికారుల భర్తీ సవాల్‌గా మారిన నేపథ్యంలో డీసీ పోస్టింగ్ దక్కించుకునేందుకు ఇదే సరైన మార్గమని భావించిన కొందరు పైరవీల బాట పట్టినట్లు తెలుస్తున్నది. మొత్తంగా కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో పుట్టుకొచ్చిన పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగాల్సింది పోయి…పైరవీలకు కేంద్ర బిందువుగా మారిందంటున్నారు. అర్హత, సీనియారిటీ కంటే ‘ అండదండలు’ ఉన్న వారికే పెద్ద పీట వేస్తున్నారన్న చర్చ ఉద్యోగుల్లో అంతర్గతంగా జరుగుతున్నది. పోస్టింగ్‌లు ఖరారు అయ్యాక ఈ అంశం మరింత రాజుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.