సిటీబ్యూరో: కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రాష్ట్రంలోని అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కొంతమందికి మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నది. గృహజ్యోతి పేరిట గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందజేస్తున్నామని చెబుతున్నా… ఇప్పటికీ కొంతమందికి పూర్తి అర్హతలున్నా పథకం వర్తించడంలేదు.
ఇందుకు నిత్యం హైదరాబాద్ కలెక్టరేట్‌కు దరఖాస్తులతో వస్తున్న అర్హులే నిదర్శనం. గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు అర్హుల నుంచి కలెక్టరేట్లో దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. తాము ఆ రెండు పథకాలకు అన్ని విధాల అర్హులమైనా ఎందుకు వర్తింపజేయడంలేదని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం రావడంలేదని చెబుతున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలా అధికారుల చుట్టూ ఎన్నడూ తిరగలేదు. కాంగ్రెస్ వచ్చింది మాకు కష్టాలు వచ్చాయి. హైదరాబాద్‌లోని బస్తీల ప్రజలు కాంగ్రెస్ సర్కారు తీరుతో అవస్థలు పడుతున్నారు. కాగితాలు, జిరాక్స్ పేపర్లు పట్టుకుని అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నాం.
– గృహజ్యోతి దరఖాస్తుదారులు