సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైనట్లేనని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.
నివేదికలన్నీ ప్రభుత్వ పెద్దలకు పంపిస్తుండటంతో అందులో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారనే విషయం తేటతెల్లం కావడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. మైనారిటీలు కాంగ్రెస్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, ఎదో ఒకటి చేయాలని భావించిన అధికార పార్టీ నేతలు ఆఘమేఘాలపై అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగుతుండటం కొసమెరుపు. అటు ఎంఐఎం, ఇటు కాంగ్రెస్‌పై ముస్లింలు వ్యతిరేకంగా ఉండటంతో అధికార పార్టీ నాయకులకు మైండ్ బ్లాక్ అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ హయంలో ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన మాగంటి గోపీనాథ్ ప్రతి ఇంటికీ సుపరిచితుడు కావడం, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమానికి ఆయన పెద్దపీట వేసిన విషయం విదితమే. ఇప్పుడు ఆయ న భార్య సునీతా గోపీనాథ్ వెంటే మేముంటామని నియోజకవర్గ ప్రజలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.
నవీన్‌యాదవ్ నామినేషన్ రోజు పలువురు రౌడీషీటర్లు పాల్గొన్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో ఈ విష యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 109 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, అతని సోదరుడు రమేష్ యాదవ్‌లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్లో చురుకుగా ఉన్న నాయకులు ,కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల ప్రచారానికి అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలున్నాయి.