సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు రేషన్ కార్డుల దందాకు తెరతీశారు. డివిజన్ల వారీగా కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తాము ఎంపిక చేసిన వారికే కార్డులివ్వాలంటూ పౌర సరఫరాల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని డివిజన్ల వారీగా తమకు అనుకూలంగా ఉన్నవారి జాబితా తయారు చేసి ముందుగా వాళ్లకే రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పౌర సరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను పిలిపించుకుని జాబితా ఇస్తున్నట్లు దరఖాస్తు దారులు చెబుతున్నారు.
తాము ఎంపిక చేసి ఇచ్చిన లిస్టు ప్రకారమే ముందుగా ఎంక్వైరీ చేయాలని హుకూం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు చెబుతుండటంతో రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు సైతం చేసేదేమీ లేకపోవడంతో తలూపుతున్నట్లు తెలుస్తున్నది. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు మీసేవలో అందరికంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిని వదిలేసి ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లలోకి ఎక్వైరీ అధికారులు వస్తున్నారని వాపోతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే విడతల వారీగా ఎంక్వైరీ చేస్తున్నామని, ఈ విడతలో మీ పేరు రాలేదని చెబుతున్నట్లు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలున్నా తమకు ఇప్పటిదాకా రేషన్ కార్డు ఎందుకు రావడంలేదని దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కార్యకర్తలకే ముందుగా రేషన్ కార్డులు ఇవ్వాలని పౌర సరఫరాల అధికారులకు అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ముందుగా దరఖాస్తులు చేసుకున్నవారిని వదిలేసి ఎంపిక చేసిన వారి ఇండ్ల వద్దకే ముందుగా ఎంక్వైరీకి వెళ్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
కొంత మంది అధికారుల చుట్టూ తిరగడం కంటే కాంగ్రెస్ నేతలకు ఎంతోకొంత ముట్టజెప్పితే రేషన్ కార్డు వస్తుందని భావించి వారిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మరికొంత మంది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకే ముందుగా రేషన్ కార్డు వస్తుండటంతో గత్యంతరం లేక రేషన్ కార్డు ఇప్పిస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటామని తప్పనిపరిస్థితుల్లో చెబుతున్నట్లు వాపోతున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమకు సహకరిస్తామంటేనే రేషన్ కార్డులు వస్తాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారని గ్రేటర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దినసరి కూలీలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లు రేషన్ కార్డు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్లు వినాల్సి వస్తుందని అంటున్నారు. అర్హతలను బట్టి ప్రభుత్వమే గుర్తించి రేషన్ కార్డులు మంజూరు చేయాల్సి ఉన్నా కాంగ్రెస్ నాయకుల ఆగడాల వల్ల పక్కదారి పడుతున్నదని గ్రేటర్ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారమే అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే వింటున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. పౌర సరఫరాల ఉన్నతాధికారులు కాంగ్రెస్ నేతల ఆగడాలను గుర్తించాలని సూచిస్తున్నారు. అర్హులకు న్యాయబద్ధంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
మాది ఎర్రగడ్డలోని నటరాజ్ నగర్. నేను ప్రజాపాలన దరఖాస్తుతో పాటు మీసేవలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన మొదటి రోజే దరఖాస్తు చేశాను. ఇప్పటి దాకా పౌర సరఫరాల అధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులెవరూ ఎంక్వైరీకి రాలేదు. కానీ మా చుట్టుపక్కల అందరి ఇండ్లకు ఫోన్లు చేసి మరీ వచ్చి ఎంక్వైరీ చేశారు.
మీసేవ కేంద్రంలో తనిఖీ చేస్తే పెండింగ్ అని చూపిస్తున్నది. రేషన్ కార్డు ఇవ్వడానికి నాకు అన్ని అర్హతలున్నా చుట్టుపక్కల వారి ఇండ్లలో ఎంక్వైరీ చేసిన అధికారులు.. మా ఇంటికి ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే నిబంధనల ప్రకారమే ఎంక్వైరీ చేస్తున్నామని సమాధానమిస్తున్నారు. అన్ని అర్హతలున్నా నాకు ఇంకా రేషన్ కార్డు ఎందుకు మంజూరు చేయడంలేదో అర్థం కావడం లేదు.
– రేషన్‌కార్డు దరఖాస్తుదారుడు, ఎర్రగడ్డ