Gruha Jyothi | మేడ్చల్, జూలై 28(నమస్తే తెలంగాణ): సాధారణ ప్రజలకు ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే, గృహజ్యోతి పథకం అర్హులకు అందేనా? అన్న అనుమానాలు అనేకం సామాన్య ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో గృహజ్యోతి పథకానికి అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు.
తెలుపు రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత కరెంట్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అర్హులైన వారికి అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గృహజ్యోతి పథకానికి వచ్చిన దరఖాస్తులు 5,50 లక్షలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో రేషన్ కార్డులు 5,23,899 ఉండగా, గృహ విద్యుత్ వినియోగదారులు 15,14,262 మంది ఉన్నారు. అయితే, గృహలక్ష్మి పథకానికి సుమారు 5,50 పైచిలుకు మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొంత మందికి మాత్రమే గృహలక్ష్మి పథకం వర్తించేలా చేస్తున్నారని, సగానికి పైగా రేషన్ కార్డులు ఉండి 200 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారికి గృహలక్ష్మి పథకం వర్తింపు జరగడం లేదన్న ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దరఖాస్తులు అందించినా దరఖాస్తుల నమోదును నిర్లక్ష్యం చేయడం మూలంగానే అర్హులకు గృహాజ్యోతి పథకం అందడంలేదు. అయితే, అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం అందేలా తిరిగి జిల్లా కలెక్టరేట్, మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాలలో తిరిగి దరఖాస్తులను చేసుకునేలా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినా, ఎంత వరకు సఫలీకృతం అవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
కాగా, రేషన్ కార్డులు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని, అయితే, అనేక మంది నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసిన నేపథ్యంలో త్వరతిగతిన నూతన రేషన్ కార్డులు అందించి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల వద్ద తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.