జూబ్లీహిల్స్‌లో ఓటమి భయం అధికార పార్టీని వెంటాడుతున్నది. ఆ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్, ఇతర పార్టీల కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేలా కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగగా.. తాజాగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దర్జాగా ఓటుకు నోట్లు పంచుతున్నది. ఇప్పటికే నేతలకు మూటలు చేరిపోయి ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారనే సమాచారం అందినా అధికారులు లోలోపలే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచార సమయంలో వారి సమక్షంలోనే డబ్బు మూటలు స్థానిక కాంగ్రెస్ నేత ఇంట్లో పెట్టి అక్కడినుంచి పంపిణీ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న కార్యకర్తల చేతుల్లో డబ్బు సంచులు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లో స్థానిక నేతలు డబ్బులు పట్టుకొని ఓటర్లకు పంచుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్కాలనీలో డబ్బులు పెద్ద ఎత్తున ఉన్నట్లు ప్రచారం జరగడంతో శుక్రవారం ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. అయితే మీడియాను, ఇతర పార్టీల నేతలను లోపలికి రానివ్వకుండా లోలోపల తనిఖీలు చేశారు.

వాడవాడలా డబ్బుల పంపిణీ !
జూబ్లీహిల్స్‌లో డివిజన్ల వారీగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో ప్రలోభాలకు తెరదీశారు. ఓటుకు నోట్లు ఇస్తూ తమకే ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వారికి గాలం వేస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో సమావేశం తర్వాత డబ్బులు ఎవరెవరికి ఎక్కడ ఎలా పంచాలో స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించడంతో ఆ లిస్టు ప్రకారమే పంచుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. బోరబండలో ఓటుకు రూ.4,000 ఇచ్చారని, రహ్మత్‌నగర్‌లో రూ.2,500 ఇచ్చారని ఇందుకోసం ముందుగానే డబ్బులు తమ వద్దకు చేరాయని ఇతర ప్రాంతాల్లో శనివారం వివాహాలు, ఇతర శుభకార్యాల వద్ద కలిసిన డివిజన్ నేతలు చర్చించుకుంటున్నారు.
ఈమేరకు ఓటర్ల లిస్ట్ తీసుకుని ఒక్కో ఓటరుకు రూ.రెండు నుంచి ఐదు వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల అధికారులు కానీ, పోలీసులు కానీ తమకు తెలిసినా ఆ వైపు చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్కడున్న ప్రజలే వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బోరబండ సైట్-3 అంబేద్కర్‌నగర్‌లో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ స్థానిక మహిళా నాయకురాలు డబ్బులు పంపిణీ చేశారు.
చేతుల్లో లిస్టులు పట్టుకున్న కార్యకర్తలు ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి?, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారంటూ అడిగి ఓటర్ స్లిప్పులు ఇస్తూ వాటి వెంట డబ్బులు కూడా లెక్కబెట్టి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎర్రగడ్డలోని ప్రేమ్నగర్కాలనీలో ఓటర్లకు కొంత ఆలస్యంగా డబ్బులు అందినట్లు సమాచారం. ఇక యూసుఫ్‌గూడ, షేక్‌పేట, కృష్ణానగర్‌కాలనీ, తదితర చోట్ల స్థానిక నాయకులకు లిస్టుల వారీగా డబ్బులు ఇచ్చినప్పటికీ రెండు విడతలుగా డబ్బుల పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.