హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు తథ్యమని తేలడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికేతరులైనప్పటికీ నియోజకవర్గంలో యధేచ్చగా తిరుగుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇక ఈవీఎంలో పార్టీ గుర్తు వరుస క్రమం తెలిసేలా, కాంగ్రెస్ రంగులున్న టీషర్ట్స్ ధరించి పలువురు యువకులు తిరుగుతున్నారు. మాకు అధికారం ఉంది, తాము ఇక్కడే ఉండవచ్చు అన్నట్లుగా మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.


రహమత్ నగర్ డివిజన్ ఎస్డీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చలయించారు. ఓటర్లను మభ్య పెడుతూ, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బూత్ వద్ద తిరుగుతున్నారు. ఇక జూబ్లీహిల్స్‌లోని అన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర సీరియల్ నంబర్ 2తో, కాంగ్రెస్ పార్టీని పోలిన టీషర్టులు ధరించి యువకులు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు, ఎన్నికల అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వదిలేస్తున్నారు. యువకులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ నేతలు గొడవలకు దిగుతున్నారు.
