జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌లో మాత్రం ప్రచారం ఖర్చుల లొల్లి నేతలకు తలనొప్పిగా మారింది. ‘మా లొల్లి మాకుంటే మీ గోల ఏంట్రా బై.. మా కార్యకర్తలకే పైసల్ ఇచ్చే పరిస్థితి లేదు.. మీ లాడ్జీల బిల్లులు మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం.. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ’ ఈసడించుకోవడంతో ప్రచారానికి వచ్చిన కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ప్రచార ఖర్చులు ఇవ్వకపోగా తిడుతున్నారంటూ దీనంగా గోడు వెల్లబోసుకుంటున్నారు. రూ.వంద కోట్లు ఖర్చు పెడతానంటూ ప్రగల్భాలు పలికి టికెట్ తెచ్చుకుని కనీసం తమను దగ్గరికి రానివ్వడం లేదని సీనియర్ నేతలు ఆగ్రహానికి లోనవుతున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిబిరంలో ప్రతీరోజూ కనిపించే పరిస్థితి ఇది. ఓ వైపు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పకడ్బందీగా ప్రచారం చేసుకుంటుంటే.. దీనికి పూర్తి వ్యతిరేకంగా తమ పార్టీలో వ్యవహారాలు కొనసాగుతున్నాయని హస్తం పార్టీ కార్యకర్తలు బాహాటంగా చెప్పుకొంటున్నారు.
జూబ్లీహిల్స్ ప్రచారం బూత్ ఇన్చార్జులుగా కార్పొరేషన్ల చైర్మన్లు వ్యవహరించగా, వారి హోటల్ బిల్లులు ఎవరు చెల్లించాలనే విషయమై వివాదం మొదలైంది. సుమారు నెల రోజుల నుంచి చైర్మన్లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, కూకట్పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీల్లో అనుచరులతో బస చేయగా సగటున రూ.2లక్షల నుంచి 3లక్షల దాకా బిల్లులు తడిసి మోపెడయ్యాయి. వాటిని అభ్యర్థే చెల్లించాలని వారు కోరగా.. ఇంతలో అసలు చైర్మన్ల ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లాభమేమీ లేదని, అన్ని సర్వేల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం వచ్చినట్టు తేలడంతో రెండ్రోజుల క్రితం వారి స్థానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇన్చార్జులుగా నియమించడంతో పాటు సుమారు 50మంది ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగించారు. దీంతో ఇప్పటిదాకా బూత్ ఇన్చార్జులుగా వ్యవహరించిన కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలకు సొంత నియోజకవర్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే వాళ్లు వచ్చి ఇక్కడ ఒరగబెట్టిందేంటని, వారి బిల్లులు తామెందుకు కట్టాలంటూ అభ్యర్థి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మా కార్యకర్తలకు ఇచ్చేందుకే డబ్బులు లేవు.. మీ ఎంజాయ్మెంట్ కోసం తామెందుకు ఖర్చు పెట్టాలంటూ అభ్యర్థి కుటుంబసభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మీకు ఏం కావాలన్నా గాంధీభవన్‌కు వెళ్లి తెచ్చుకోండి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ మొహమాటం లేకుండా చెప్పేయడంతో గదులు బుక్ చేసిన నేతలు ఏం చేయాలో అర్థంకాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. పార్టీ కోసం గల్లీ గల్లీ తిరిగిన తమను అవమానించడమే కాకుండా, ఖర్చులు కూడా తమ నెత్తిమీద వేస్తే ఎలా అంటూ సన్నిహితుల వద్ద వాపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.