సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబానికి రౌడీ షీటర్ ముద్ర ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ నాయకులు కుమిలిపోతున్నారు. తమ అభ్యర్థికి అరాచక నేపథ్యం ఉండటంతో ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోతున్నామంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత.. మరో పక్క అభ్యర్థి కుటుంబానికి రౌడీషీట్ ముద్ర ఉండడంతో ఓటెయ్యమని అడగాలంటే బాధగా ఉంటుందంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రజలే ప్రశ్నిస్తుండడంతో అక్కడి నుంచి జారుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్యాదవ్ను ప్రకటిస్తే, అతడి తండ్రి పై ఉన్న రౌడీషీట్ కారణంగా ప్రజల్లోకి వెళ్లి ముఖం చూపించలేమని అప్పట్లోనే పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధి నాయకత్వం పట్టించుకోలేదని ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ముఖ్య నేతలు ఇటు వైపు చూడడం లేదని చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం ఉండటం, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధితో జుబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్‌గా మారుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు అటువైపు చూడటానికి వెనుకడుగు వేస్తున్నారని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్‌తో పార్టీ పరిస్థితిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే సమాచారంతో కాంగ్రెస్ కీలక నాయకులు ప్రచారానికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
అధికారంలో ఉన్నాం.. మనం చెప్పేది ప్రజలు నమ్ముతారనే భ్రమలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, అయితే అక్కడ ఏమి చేసినా ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, మనం ఏమి చేసినా కష్టమేనంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి పరిస్థితిని చూసిన మంత్రులు ప్రచారానికి ముందుకు రావడం లేదని సమాచారం. కేవలం ఇద్దరు మంత్రులే అప్పుడప్పుడు ప్రచారంలో కన్పిస్తున్నారు. పార్టీ అభ్యర్థికి మంచిపేరు లేకపోవడం, కుటుంబానికి రౌడీముద్ర ఉండడంతో ప్రజలకు ఏమి చెబుదామంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు తమ సీనియర్ నాయకుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. రెండేండ్లుగా అధికారంలో ఉన్న తమ పార్టీ అటు నగరాన్ని ఇటు రాష్ర్టాన్ని అభివృద్ధి సంక్షేమంలో దెబ్బతీసిందని స్వయంగా అధికార పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజలు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతామంటూ ప్రశ్నించుకుంటున్నారు.