ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఖద్దరు.. ఖాకీ… సాధారణంగా రెండూ కలిసే ఉంటాయంటరు. కానీ తేడా వస్తే ఖాకీ బయటికి తెల్వకుండా స్విచ్ నొక్కుతాడు! ఖాకీ లబోదిబోమని బహిరంగంగానే విరుచుకుపడతాడు. గత కొంతకాలంగా రాష్ట్రంలో… మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ఖద్దరుకు… ఖాకీకి పడటం లేదు. తెర వెనక మతలబేమిటో ఎవరూ చెప్పరు. కానీ మీడియా ముందు ఖాకీలపై ఖద్దరు తరచూ విరుచుకుపడుతుండటం కనిపిస్తున్నది. ఇవి పైకి కనిపిస్తున్నయే… మరి తెర మీదకు రాని ఖద్దరు-ఖాకీల కోల్డ్‌వార్ ఇంకెన్ని చోట్ల బయటపడనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఎవరిది తప్పనేది దేవుడెరుగు… కానీ ఇటీవలికాలంలో అధికార పార్టీ వర్సెస్ పోలీసు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ఇవి ముదిరి ఆరోపణలదాకా వస్తున్నాయి. కొంతకాలం కిందట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుబ్రహ్మనగర్ బస్తీలోని గుడిసెల విషయంలో వివాదం నెలకొంది. ఆపై వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా… హైడ్రాపై మాత్రం దానం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ పదేపదే చెబుతున్నారు. ఇదే విషయంలో ఒక పోలీసు ఉన్నతాధికారి సుమోటాగా కేసు నమోదు చేశారంటూ దానం ఆయనపై విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి అధికారులు వచ్చిపోతుంటారు… అక్కడ పని చేయడం ఇష్టం లేక ఇట్ల చేస్తే, అక్కడి నుంచి తీసి మంచి పోస్టు ఇస్తరని అనుకుంటున్నరు..’ అని పేరు చెప్పేందుకు నిరాకరించారు.
సదరు ఉన్నతాధికారిపై స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ కూడా ఇస్తానన్నారు. అనంతరం కొన్నిరోజుల కిందట చింతల్‌బస్తీలో ట్రాఫిక్ పోలీస్-జీహెచ్ఎంసీ సంయుక్తంగా రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను కూల్చివేశారు. అనుకోకుండా అక్కడికి వచ్చిన దానం ట్రాఫిక్ విభాగానికి చెందిన ఒక పోలీసు అధికారితో ఫోన్లో మాట్లాడారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం వచ్చని తర్వాత మాట్లాడుదాం… అప్పటివరకు ఆగండి! అన్నా పోలీసులు వినిపించుకోలేదు. కూల్చివేతలు పూర్తి చేశారు. దీంతో ఈ విషయంలోనూ పోలీసులకు దానంకు మధ్య కోల్డ్‌వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలిసింది.
ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సివిల్ సర్వీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఐపీఎస్‌లు శిక్షణ సమయంలోనే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే మూడు రోజుల కిందట టీపీసీసీ టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధుయాష్కీ ఎల్బీనగర్ డీసీపీపై నేరుగా ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లోనే మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఎల్బీనగర్ డీసీపీ భూ వివాదాల సెటిల్మెంట్లు చేస్తున్నారని, అసలు భూ వివాదాల్లో పోలీసులకేం పని? అని నేరుగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్న ఆయన… మారితే మంచిది లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించడం గమనార్హం.
కాగా ఈ సందర్భంగా గతంలో ఖద్దరు-ఖాకీ మధ్య నెలకొన్న ఓ వివాదంపై కూడా చర్చ జరుగుతుంది. శివారులో ఒక భూ వివాదానికి సంబంధించి మంత్రి ఒకరు పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి… మన వాళ్లే వస్తారు, కాస్త సహకరించండి అని కోరినట్లు తెలిసింది. దీంతో సదరు పోలీసు ఉన్నతాధికారి తాను భూ వివాదాన్ని సెటిల్ చేయనని ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు మంత్రి కోపంతో ‘మంత్రి చెప్పినా వినరా?’ అని పరోక్షంగా ధమ్కీ ఇవ్వడంతో తాను బదిలీకి సిద్ధంగా ఉన్నానని కూడా పోలీసు ఉన్నతాధికారి తెగేసి చెప్పడంతో వెంటనే మంత్రి ఫోన్ కట్ చేయక తప్పలేదని తెలిసింది. ఆ సందర్భంగానే ఈ విషయాన్ని అమాత్యులు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ప్రచారం జరిగింది.