మణికొండ, ఫిబ్రవరి 2: ‘ప్రభుత్వ భూమియే కదా అడ్డంగా కబ్జా చేయొచ్చు.. ఎందుకంటే సర్కారు మాదే.. నాయకులూ మావారే.. మమ్మల్ని అడ్డుకునేదెవరు’ అన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది నాయకులైతే అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చరిత్రాత్మక కుంటలు, చెరువులతో పాటు ప్రభుత్వ భూములను ఎక్కడ కనిపించినా..ప్రభుత్వ పెద్దలతో స్థానిక రెవెన్యూ అధికారులకు ఫోన్లు చేయించి పట్టపగలే భూ ఆక్రమణలు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సిన నాయకులు కొందరు విలువైన గ్రామకంఠ భూములను కబ్జాలు చేస్తూ ఇండ్లు, ప్రహరీలను నిర్మించి.. అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత బహిరంగంగా కబ్జాలు చేస్తున్నారని తెలిసినా.. రెవెన్యూ యంత్రాంగం సైతం కిమ్మనకుండా ఉండాల్సిన దుస్థితి.
అధికార పార్టీ పెద్దలతో..
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన పిత్రికుంట గ్రామకంఠం భూమి 0-20 గుంటల వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమి పక్కనే గ్రామస్తులు ఇండ్ల నిర్మాణాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మిగిలిన ఈ గ్రామకంఠ భూమి (పిత్రికుంట)పై అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. అనుకున్నదే తడువుగా గత సర్పంచ్‌లుగా పనిచేసిన ఓ వ్యక్తి తమకు రికార్డు రాసిచ్చినట్లు పత్రాలను తయారు చేసి, అక్కడ కొన్ని ఇండ్లను నిర్మించేందుకు అధికార పార్టీ పెద్దలతో స్థానిక రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయించి.. పిత్రికుంట భూమిని ఆక్రమించే పనిలో తెరవెనుక ఉండి కబ్జాలతతంగం కానిచ్చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు మట్టి కుప్పలను తీసుకువచ్చి డంపింగ్ చేయడం…ఆపై గోడలను నిర్మిస్తున్నారు. ఇదే విషయమై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని కబా ్జచేస్తున్నా.. రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండిపోవడంపై మంచిరేవుల గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
తెరవెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి..
ఇన్నాళ్లు అక్రమాలకు తావులేని తమ గ్రామంలో పిత్రికుంట పూర్తిగా కబ్జా చేస్తున్నారని ఇదంతా తెరవెనుక మంచిరేవుల గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే స్థానిక ఓ రియాల్టర్ కంపెనీ యజమాని రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనంటూ మంచిరేవుల గ్రామంలో అనేక అక్రమాలకు తెరలేపుతున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ల్యాండ్ అనే ఓ లే అవుట్‌కు అనుకున్న ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించేశారని ఆరోపిస్తున్నారు. అదే విధంగా బైరాగిగూడ-గంధంగూడ గ్రామ సరిహద్దు భూములు సైతం ఆక్రమణలకు గురైనట్లు చెప్పారు. ఈ పిత్రికుంట కబ్జాలోనూ ఆ నాయకులే తెరవెనుక ఉండి కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంచిరేవుల గ్రామానికి ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఓ నాయకుడు తెరవెనుక ఉంటూ పిత్రికుంటను కబ్జా చేసి గోడలను నిర్మించి విక్రయించాలనే ప్రయత్నాలు సాగుతున్నదని మంచిరేవుల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకునే ప్రయత్నం…అంతలోనే..
మంచిరేవుల గ్రామ పరిధిలోని గ్రామకంఠానికి చెందిన 0-20 గుంటల భూమిని రాత్రి, పగలు అన్న తేడా లేకుండా కబ్జాలు చేస్తున్నారని తెలుసుకున్న గండిపేట రెవెన్యూ అధికారులకు పై నుంచి ఫోన్ రావడంతో కిమ్మనకుండా వెనక్కితగ్గినట్లు తెలిసింది. అక్కడ జరుగుతున్న కబ్జా అని తెలిసి పనులను నడపకుండా కొన్ని వాహనాలను సీజ్ చేసేందుకు రెవెన్యూ కార్యాలయానికి అధికారులు తీసుకువవచ్చారు. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్కు అధికార పార్టీ పెద్దలు అక్కడకు వెళ్లొదంటూ..హుకూం జారీ చేశారని తెలిసింది. దీంతో ఆ అధికారి అక్కడకు పోయేందుకు జంకుతుండటం గమనార్హం. ఈ కబ్జా విలువ అక్షరాల రూ.60 కోట్ల పైమాటేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో హడావుడి చేసిన రెవెన్యూ సిబ్బంది.. ఇప్పుడంతా నిశ్శబ్దంగా మారడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నది.
అధికార పార్టీ అయితే కబ్జాలు చేయొచ్చా…?
అధికార పార్టీకి చెందిన నాయకులైతే ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేయవచ్చా.. అని మంచిరేవుల గ్రామస్తులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడు ఇండ్లు నిర్మిస్తే అనుమతులు, అక్రమాలంటూ ఆగమేఘాలపై వచ్చికూల్చివేస్తారని..ఇప్పుడు ఇంత బహిరంగంగా విలువైన గ్రామకంఠం భూమిని కబ్జాలు చేస్తుంటే ఎందుకు అధికారులు మౌనంగా ఉన్నారంటూ మంచిరేవుల వాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారైతే ఓ న్యాయం..పేదవారికి మరో న్యాయమా అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి కబ్జారాయుళ్లపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు చేసేందుకు వెనుకాడబోమంటూ మంచిరేవుల గ్రామ ప్రజలు అంటున్నారు.
కబ్జాపై విచారణ చేపడుతాం
మంచిరేవుల గ్రామానికి చెందిన గ్రామకంఠ పిత్రికుంట భూమి కబ్జాలపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. పక్కనే పేదప్రజలకు కేటాయించి 60 గజాల భూముల్లోనూ అక్రమాలు జరిగినట్లు మా దృష్టి వచ్చింది. త్వరలోనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుని ఆక్రమణలకు గురైన భూములను కాపాడుతాం.
– శ్రీనివాస్‌రెడ్డి, గండిపేట తహసీల్దార్