సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) ;మహానగరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై రెండో జాబితా పిడుగుపాటులా తయారైంది. ఉన్న పది మందిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారంతా ఉడాయిస్తారని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్ఠానం తప్పని పరిస్థితుల్లో ఈ నెల 27న రెండో జాబితాను విడుదల చేసింది. అందులో మహానగర పరిధిలో పదకొండు స్థానాలు ఉండగా, ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొనసాగింపుగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ వచ్చిన వారు మినహా మిగిలిన వారు గులాబీ పార్టీలోకి సర్దుబాటు అవుతుండటంతో గ్రేటర్ కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. టికెట్ ఇచ్చిన వారికి పార్టీలో ఉన్న స్థానిక నేతలు కూడా సహాయ నిరాకరణ చేయడం కొసమెరుపు.
మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్లుగా..
హైదరాబాద్ మహా నగరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌పై రెండో జాబితా పిడుగుపాటులా తయారైంది. ఉన్న పది మందిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారంతా ఉడాయిస్తారని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్ఠానం రెండో జాబితా విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో ఈ నెల 27వ తేదీన రెండవ జాబితాను విడుదల చేయగా.. అందులో మహా నగర పరిధిలో పదకొండు స్థానాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు భగ్గుమన్నారు. దీనికి కొనసాగింపుగా… నియోజకవర్గాల్లో టికెట్ వచ్చిన వారు మినహా మిగిలిన వారు గులాబీ పార్టీలోకి సర్దుబాటు అవుతుండటంతో గ్రేటర్ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. టికెట్ ఇచ్చిన వారికి పార్టీలో ఉన్న స్థానిక నేతలు కూడా సహకరించడం లేదు. మరోవైపు బీజేపీది కూడా ఇలాంటి దుస్థితే. కీలక స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా ఆ పార్టీ అధిష్ఠానం సాహసం చేయలేకపోతుంది. ఇతర పార్టీల నుంచి ఎవరో వస్తారు… అని ఎదురుచూస్తున్న ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్వైపే కాంగ్రెస్ నేతలు క్యూ కడుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహా నగర పరిధిలో ఇప్పటికీ వార్ వన్‌సైడ్‌లా.. బీఆర్ఎస్
పార్టీ ప్రచారమే కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్, బీజేపీ జెండాల రెపరెపలు నల్లపూసలయ్యాయి.
హైదరాబాద్ మహా నగర పరిధిలో దాదాపు అన్ని స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఎక్కువ స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరంటూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. తొలి జాబితాతో పెద్ద ఎత్తున అసంతృప్తులు పార్టీ అధిష్ఠానంపై కన్నెర్ర జేశారు. చివరకు పాతబస్తీ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ అసమ్మతి భగ్గుమని.. చివరకు గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేసేవరకు చేరింది. మేడ్చల్‌లోనూ అసమ్మతి తీవ్రస్థాయికి వెళ్లింది. ఉప్పల్లోనైతే ఏకంగా పార్టీ ఖాళీ అయ్యింది. కీలక నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు ఆయన టీపీసీసీ రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించడంతో పాటు నిజం కాకపోతే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి చెందిన ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
గులాబీ పార్టీలోకి వలసల జాతర
రెండో జాబితా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ తీవ్రస్థాయిలో రేవంత్‌పై ఆరోపణలు చేశారు. ఆయన కూడా బీఆర్ఎస్లో చేరారు. కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ హస్తం ఖాళీ కానున్నది. ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్లో చేరుతున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కడ ఆయనతో పాటు పార్టీ మొత్తం బీఆర్ఎస్లోకి వస్తుంది. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత గొట్టిముక్కల వెంగళరావు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. త్వరలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు పార్టీని వీడేందుకు ఇప్పటికే నిర్ణయించారు. కాకపోతే రేపోమాపో బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో గులాబీ పార్టీలోకి వలసల జాతర ఇంకా కొనసాగనున్నది.
ఒంటరిగానే ప్యారాచూట్ నేతలు..
కాంగ్రెస్ రెండో జాబితాలో ఎక్కువగా ప్యారాచూట్ నేతలకే టికెట్ ఇవ్వడంతో స్థానిక నేతలు, క్యాడర్ ఎవరూ వారికి సహకరించడం లేదు. ఎల్బీనగర్లో మధుయాష్కీ గతంలో తన వెంట ఉండే అనుచరులతోనే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట కనిపించడం లేదు. మహేశ్వరంలో కేఎల్ఆర్కు ఎవరూ సహకరించే పరిస్థితి లేక ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వస్తున్నారు. టికెట్ ఆశించిన చిగిరింత దంపతులు రెండు రోజుల కిందట భారీ ఎత్తున సమావేశం నిర్వహించారేగానీ ఇప్పటికీ వరకు పార్టీ అభ్యర్థి వైపు కన్నెత్తి చూడటం లేదు. మిగిలిన శ్రేణులు కూడా కేఎల్ఆర్కు సహకరించే పరిస్థితి లేకపోవడంతో నియోజకవర్గంలో కేవలం బీఆర్ఎస్ ప్రచారమే జోరుగా సాగుతుంది. కూకట్‌పల్లిలో మరో ప్యారాచూట్ నేతకు టికెట్ ఇవ్వడంతో ఆయన నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అంబర్‌పేటలో కూడా ప్యారాచూట్ నేత రోహిన్‌రెడ్డికి స్థానిక నేతలు, క్యాడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
జంకుతున్న కమలనాథులు..
హైదరాబాద్ మహా నగరంలో పరిమిత స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదు. ఆదిలో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా? అని ఎదురుచూసిన ఆ పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది. కనీసం కాంగ్రెస్ జాబితాల ప్రకటన తర్వాతనైనా ఎవరైనా వస్తే వారి చేతిలో టికెట్ పెట్టాలని చూశారు. కానీ కాంగ్రెస్ అసంతృప్తులు తెలంగాణ భవన్‌కు క్యూ కడుతుండటంతో కమలనాథులను నిరుత్సాహం ఆవహించింది. దీంతో కీలకమైన స్థానాల అభ్యర్థుల ప్రకటన ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. జనసేనతో పొత్తు అంటూ మరింత కాలయాపన చేస్తున్నారు. కాగా పొత్తులో భాగంగా కూకట్‌పల్లిని జనసేనకు ఇస్తారనే ప్రచారంపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. సోమవారం నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఈ అంశంపై తీవ్రస్థాయిలో అసమ్మతి గళం వినిపించారు.