మేడ్చల్, జనవరి 30(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు కారెక్కుతున్నారు. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల పరిధిలో మూడు రోజులుగా కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంపై కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహం ఏర్పడింది. శుక్రవారం అలియాబాద్లో కాంగ్రెస్కు చెందిన నాయకులు బండి లక్ష్మి, రాంరెడ్డి, శ్రీఖర్రెడ్డిలతో పాటు 20 మంది కార్యకర్తలు మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల ఎంపికను చేయగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ నేతలే గుసగుస లాడుతున్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసేందుకు అంతగా ఉత్సాహం చూపించకపోవడంతో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. దీంతో బీఆర్ఎస్ దూకుడు చూసి కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు.