మేడ్చల్/శామీర్‌పేట/మేడ్చల్ కలెక్టరేట్, ఘట్కేసర్ రూరల్/పీర్జాదిగూడ/జవహర్‌నగర్, నవంబర్ 2 : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం నాయకుడు దుర్గం రాంబాబు, సతీశ్, గణేశ్, ఎస్కే.సోహెల్, శేఖర్, కరుణాకర్, రమేశ్, ప్రసాద్, ప్రవీణ్, శివ బీఆర్ఎస్లో చేరగా.. మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు దత్తుగౌడ్, శ్రీనివాస్, రవీందర్రావు, సాయిగౌడ్, సంతోష్ ఓంకార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
మేడ్చల్ : మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి గెలుపు కోసం మేడ్చల్ మున్సిపాలిటీలో గురువారం బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహరెడ్డి, మంత్రి కోడలు శాలినిరెడ్డితో కలిసి వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. వీధుల్లో పర్యటిస్తూ చిరు వ్యాపారులు, ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్లతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మల్లారెడ్డి గెలుపుతో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం యధావిధిగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మేడ్చల్ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్లు కౌడె మహేశ్, జాకట దేవరాజ్, ఉమా నాగరాజు, నాయకులు ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
పీర్జాదిగూడ : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్‌రెడ్డి అన్నారు. డివిజన్ పరిధి కాలనీల్లో గురువారం ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను ఓటర్లకు అందజేశారు. 16వ డివిజన్లో కార్పొరేటర్ బండిరమ్య మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా డివిజన్ పరిధిలోని కాలనీల్లో నాయకులు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నాగారంలో చైర్మన్ ప్రచారం
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 17 వార్డుల్లో చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్ గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహి స్తూ మంత్రి మల్లారెడ్డి ఎన్నికైన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోను వివరించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్, కౌన్సిలర్ సురేశ్, సురేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేత చామకూర భద్రారెడ్డి గురువారం ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు రమేశ్ గౌడ్, రాములు, శ్రీధర్ గౌడ్, ఖాజామియా, నారాయణ రెడ్డి, భాస్కర్ గౌడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టించాలి..
ఘట్కేసర్ రూరల్ : ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి తెలిపారు. మండల పరిధి అవుషాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు భిక్షపతి గౌడ్, ఉప సర్పంచ్ అయిలయ్య యాదవ్, పంచాయతీ సభ్యులు వీరేశం, శ్రీనివాస్ గౌడ్, కుశలవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే జవహర్‌నగర్ అభివృద్ధి
జవహర్‌నగర్ : బీఆర్ఎస్ గెలిస్తేనే జవహర్‌నగర్ మరింత అభివృద్ధి చెందుతుందని పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ అన్నారు. గురువారం కార్పొరేషన్‌లోని పలు కాలనీల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొడుగు వేణు, నాయకులు మహేశ్, మాధవరెడ్డి, వెంకటేశ్, శ్రీలత, గున్న సంధ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.