“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు కనిపించకుండా నిరంతరాయంగా విద్యుత్ వచ్చేలా చేశారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంత భేదాలు లేకుండా ఏ పంచాయితీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్‌తో పాటు క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి అన్ని పండుగలకు ప్రాధాన్యతనిచ్చారు. హైదరాబాద్‌ను తెలంగాణ గుండెకాయగా మార్చారు. అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారు.
బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో వేలు పెట్టలేదు. కబ్జాలు, గూండాగిరీ చేయలేదు. కానీ 20 నెలల్లోనే కాంగ్రెస్ నేతలు హైడ్రా పేరుతో అరాచకం సృష్టించారు. హైడ్రా కాంగ్రెస్ దందాకు అడ్డాగా మారింది. కోర్టు ఆదేశాలు ఉన్నా అవేవీ పట్టించుకోకుండా పేదల ఇండ్లను గుడిసెలను నిర్దాక్షిణ్యంగాకూల్చివేశారు. పెద్దల సౌధాల జోలికి మాత్రం వెళ్లలేదు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇంటిని ముట్టుకునే దమ్ము హైడ్రాకు ఉందా?
మియాపూర్ , ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి సీఎం కేసీఆర్ హయాంలో పదేండ్లలో నగరం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని ఆ పురోగతిని చూసే ప్రజలు గులాబీకి జై కొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఏ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని ఇందంతా సమర్థుడైన నాటి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయిందని చెప్పారు. పెద్దలను వదిలి పేదల ఇండ్లను నేల మట్టం చేస్తున్న హైడ్రా కాంగ్రెస్ దందాకు అడ్డాగా మారిందని విమర్శించారు.
అసమర్థ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు రాబోయే ఉప ఎన్నికలతో పాటు బల్దియా ఎన్నికలలో తగు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నిర్వహించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు, ..గెల్లు శ్రీనివాస్, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, మాధవరం రంగారావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర అభివృద్ధి అతలాకుతలమై రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలుపెట్టలేదు. కబ్జాలు, గుండాగిరీ చేయలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతలు అరాచకం సృష్టించారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇండ్లు కూలగొట్టారు. కూకట్‌పల్లిలో తన ఇల్లు ఎక్కడ కూల్చేస్తారోనన్న భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం మనం ఇంకా మరిచిపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్నడు. ఆ ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?
కేసీఆర్ హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆస్పత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్క కొత్త ఫ్లైఓవరన్నా కట్టిండా? ఆయన ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ ఒక రోజు కేసీఆర్ మీద ఇంకో రోజు నామీద కేసులంటూ అదంటూ ఇదంటూ పిచ్చిగా మాట్లాడడం తప్ప హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదు. నగరంలో మురుగు నీటినంతటినీ మూసీలోకి వెళ్లేలా రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి పటిష్టమైన వ్యవస్థను, ట్రీట్మెంట్ ప్లాట్లను నిర్మించాం. నగరం మినీ భారత దేశంగా ప్రాచుర్యం పొందింది. ప్రాంతాలకు భాషకు అతీతంగా ఎవరు వచ్చినా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యే గాంధీ తన వ్యక్తిగత అభివృద్ధి, ఆస్తుల రక్షణ కోసమే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్ను పోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నియోజకవర్గంలో హైడ్రా నిరుపేదల గుడిసెలు కూలగొడుతుంటే గాంధీ ఎందుకు మౌనం వహించారు. ఏ ఒక్క బాధిత పేద ప్రజలను కనీసం పలుకరించలేదు. పేదల గుడిసెలు కూల్చవద్దని కనీసం ఆయన ఏనాడూ నోరు తెరిచి అడగలేదు. గాంధీ ప్రస్తుతం అటు ఇటూ కాకుండా ఉన్నారు.
ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉంటే ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు గాంధీ ఎందుకు హాజరు కాలేదు. దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుని ఉప ఎన్నికలలో బీఆర్ఎస్పై గెలవాలి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు.. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు సహా మేమంతా అండగా ఉంటాం. కాంగ్రెస్ అరాచకాలను ఇదే విధంగా ఎండగడదాం” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు రవీందర్‌యాదవ్, వాలా హరీష్‌రావు, ఎర్రబెల్లి సతీష్‌రావు, రవీందర్‌యాదవ్, పురుషోత్తం యాదవ్, భద్రయ్య, కిరణ్ యాదవ్, మల్లారెడ్డి, రాజు, తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఆయన పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు బాధపడాల్సిన పనిలేదని, నియోజకవర్గ పార్టీ శ్రేణులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మాధవరం కృష్ణారావు భరోసా ఇచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఉప ఎన్నికలలో గులాబీ శ్రేణులు, ప్రజలు తగు గుణపాఠం చెప్పటం తథ్యమన్నారు.
ఏ పార్టీ కార్యకర్తల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పార్టీ కార్యకర్తలపైనే ప్రస్తుత ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గ అభివృద్ధికి తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే జరిగిందని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ 420 హామీలపై ప్రజలను చైతన్య పరచాలని ఎమ్మెల్యే కృష్ణారావు పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని , ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. సభకు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. దీంతో నరేన్ గార్డెన్స్ ప్రాంగణం గులాబీ దండుతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్, కూకట్పల్లి, మియాపూర్, హఫీజ్‌పేట్, మాదాపూర్, చందానగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి , ఆదర్శ్‌నగర్ డివిజన్ల నుంచి ఆయా డివిజన్ల పార్టీ బాధ్యుల ఆధ్వర్యంలో వందలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు సభకు తరలివచ్చారు. కళాకారుల ఆటపాటతో సభా ప్రాంగణం మారుమోగింది. సభకు స్వచ్చందంగా పెద్ద సంఖ్యలో తరలి రావటం, కాంగ్రెస్ అసమర్థపాలనను ఎండగడుతూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కృష్ణారావు ప్రసంగాలకు కార్యకర్తలు తమ కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. స్థానిక ఎమ్మెల్యే తన వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీ మారాడని, ఉప ఎన్నికలలో తగు గుణ పాఠం నేర్పాలని అతిథులు పేర్కొనటంతో కార్యకర్తలు పెద్ద పెట్టున చప్పట్లతో మద్దతు ప్రకటించారు.