సిటీబ్యూరో, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) ః పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు… అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక… రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జి మంత్రి. కానీ భారీ వర్షాలకు నగరవాసులు అల్లాడిపోతుంటే మాత్రం కనీసం పలకరింపుకైనా ఎవరూ కనిపించడం లేదు.
కనీసం తాము ప్రాతినిథ్యం వహించే ప్రాంతాల్లోనైనా వరద కష్టాలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షంతో గురువారం కూడా అనేక ప్రాంతాల్లో జనం వరద నీటితో నరకయాతన అనుభవించారు. కానీ ముగ్గురు ఎంపీల్లో ఒక్కరు కూడా బాధితుల వైపు కన్నెత్తి చూడలేదు. ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనతో సరిపెట్టుకున్నారు. రికార్డు స్థాయి వానలతో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునిగిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు స్థానిక నేతలు.
ముఖ్యంగా స్థానిక నేతలతోపాటు, కాంగ్రెస్ జిల్లా ఇంఛార్జి మంత్రులు కూడా వరద ప్రభావితాల్లో పర్యటించలేదు. కానీ పార్టీపరమైన కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావుడిలో గడిపారు. బుధవారం రాత్రి 8గంటలకు మొదలైన గురువారం సృష్టించిన వరద బీభత్సం సృష్టిస్తే.. జిల్లా మంత్రులు, స్థానిక లోక్సభ ఎంపీలు కూడా ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉన్నారు. కనీసం లోతట్టు ప్రాంతాలను పర్యటించకున్నా.. హైదరాబాద్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడితే ఏమాత్రం పట్టించుకున్నవారే లేకుండాపోయారు.
చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ పరిధిలో పలు కాలనీలు నీట మునిగిపోతే ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అటువైపు కన్నెత్తి చూడలేదు. తమ కాలనీల్లో నీట మునిగిన ఇండ్లలో జనాలు పడుతున్న బాధలను పట్టించుకోలేదనీ బాధితులు నెత్తినోరు మోదుకున్నా… వినిపించుకోలేదు. కనీసం
ఇక హైదరాబాద్ లోక్సభ పరిధిలో వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయి, ఒకరి మృతదేహం వలిగొండ వద్ద మూసీ ఒడ్డున తేలితే పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ కనీసం ఆయా కాలనీలను సందర్శించలేదు. ఇప్పటికీ ఓల్డ్ సిటీ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు జలమయమైన స్థానిక ఎంఐఎం నేతలు మినహా ముఖ్య నేతలెవరూ ఇంటి గడప దాటలేదు.
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పలు కాలనీలను వరద నీటితో నిండిపోయాయి. కాలనీలు, బస్తీలు, సెల్లార్ల నిండా వరద నీరు చేరితే కనీసం ఎంపీ ఈటల రాజేంధర్ స్థానికంగా వరద పరిస్థితులేంటనీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రజా సమస్యలపై హడావుడి చేసే రాజేందర్… నగరాన్ని ముంచెత్తిన వరదలతో జనాలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ కనిపించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
ఇక నిత్యం ప్రజల్లో ఉంటాన్నంటూ చెప్పుకునే సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను ఇప్పటివరకు తెలుసుకోలేదు. సొంత నియోజకవర్గంలోని సనత్ నగర్, ముషీరాబాద్బాద్, సికింద్రాబాద్ ప్యాట్నీ నగర్ వంటి ప్రాంతాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నా… కనీసం వరద నిర్వహణ చర్యల గురించి ఆరా తీయలేదు. గురువారం ఎంపీ కిషన్ రెడ్డి దిశ ప్రత్యేక కార్యక్రమాల కోసం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షించిన ఆయన.. కనీసం నగరంలో వరద పరిస్థితిపై ఆరాతీసిన దాఖాలాలు లేవు.
రెండు రోజులుగా ఎడతెరపి లేని వానలు, రికార్డు స్థాయి కుండపోత వర్షాలతో నగరంలో వరద నీరు పోటెత్తి జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు దాపురించాయి. గతంలో ఎన్నడూ లేనంత వరద బీభత్సం సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కనిపించడం లేదు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ వరదల సమయంలోనే నగరం విడిచి ఢిల్లీ పర్యటనల్లో ఉంటే… హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత కార్యక్రమాలకు పరిమితమైయ్యారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలపై ప్రభుత్వ స్థాయిలో క్షేత్రస్థాయి పర్యటనలు దేవుడెరుగూ, కనీసం కార్యాలయాల్లో నిర్వహించే సమీక్షలు కూడా జరగలేదు.