జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇదో రికార్డు. తొలిసారిగా ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సహా ఒకేసారి పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు.. ఇదేదో పొరపాటుగా జరిగిన వ్యవహారం కాదు.. ఒకరిద్దరు అధికారులు మిలాఖతై చేసిన తప్పు అంతకన్నా కాదు.. తెర వెనక ఒక కాంగ్రెస్ నేత రచించిన అవినీతి పథకంలో భాగస్వాములయ్యారు. ప్రజా ధనాన్ని పలహారంగా పంచుకున్నారు. అప్పటికే కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టడంతో పాటు అత్యాశతో మరో రూ.122 కోట్లకు సైతం బిల్లులు తయారుచేసి ఖజానాకు టెండర్ పెట్టారు. కానీ అవినీతి పుట్ట పగలడంతో అక్రమాల పరంపర వరదలా బయటికొచ్చింది. చివరకు అవినీతి క్రీడలో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. బడంగ్‌పేట అక్రమాల వ్యవహారం కేవలం అధికార వర్గాలకే పరిమితం కాలేదు. నిత్యం పత్రికల్లో వస్తున్న అవినీతి కథనాలు.. తెర వెనక ఉన్న నేతపై ఆరోపణలు వస్తుండటంతో అధికార పార్టీలోని ఇతర నేతలు రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)
మున్సిపల్ కార్పొరేషన్… విలీన ప్రక్రియతో జీహెచ్ఎంసీలో భాగమైన బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. గతంలో ఎన్నడూలేని విధంగా అవినీతి వ్యవహారంలో ఒకేసారి పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడటం సంచలనంగా మారింది. ఇదేదో ఒక్క పని.. ఒక్క రోజులో జరిగిన అక్రమం కాదు. గత పాలకవర్గం పదవీ కాలం ముగుస్తున్న తరుణంలోనే ఈ భారీ అవినీతికి బీజం పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ ముందు అవినీతి నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు విశృంఖలమయ్యాయి.
అయితే అసలు ఇంత భారీ అవినీతి తతంగానికి సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఈ క్రమంలో భాగస్వాములే తమ సన్నిహితులు, సహచరుల దగ్గర మాట్లాడుకునే వివరాల ప్రకారమైతే… తెర వెనక ఓ అభయ‘హస్తం’ అక్రమాలకు రూపకల్పన చేయడంతో పాటు ఏ విచారణ జరగకుండా అన్నీ తానే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో అసలే అధికార పార్టీ నేత… ఇంకేముంది! ఎంత అవినీతి చేసినా చెల్లుతుందనే నిర్ణయానికొచ్చిన అధికారులు తిలాపాపం… తలా పిడికెడు! అన్నట్లుగా వ్యవహరించారు.
పాలకవర్గం ముగిసే సమయంలో జీతాలు, నిర్వహణతో కలిపి రూ.39 కోట్ల బడ్జెట్ ఉంటే ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల్లో ఏకంగా రూ.122 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు పెట్టారు. చేయని… గతంలో చేసిన… అసంపూర్తి పనులకు సుమారు రూ.49 కోట్లదాకా చెల్లింపులు పూర్తయ్యాయి. మరో రూ.43 కోట్ల వరకు బిల్లుల చెల్లింపు జరగాల్సి ఉంది. ఇదే క్రమంలో కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనమయ్యే సమయం వచ్చింది. దీంతో మరోసారి ఎడాపెడా టేబుల్ ఎజెండాగా మరిన్ని పనులు ప్రతిపాదించారు.
రూ.5 లక్షల వరకు కమిషనర్ స్థాయిలో ప్రత్యేక పనులకు అనుమతులు ఇచ్చే అధికారం ఉండటంతో ఔరేఖ్ ధక్కా! అన్నట్లుగా వ్యవహరించారు. ఇలా మరో రూ.50 కోట్ల దాకా ప్రతిపాదనలు తయారు చేయగా… అందులో కొన్నింటిని బిల్లుల చెల్లింపు దశకు తీసుకువచ్చారని అధికారుల మధ్యనే జరుగుతున్న చర్చ. వీటిల్లో భాగంగానే సదరు నేత సొంత ప్రైవేటు లేఅవుట్లకు సైతం కోట్ల రూపాయలతో డ్రైనేజీ, రోడ్లు వేయించుకున్నారనేది బహిరంగ రహస్యం. కాగా ఈ పనుల్లో అత్యధికం సదరు నేత బినామీ కాంట్రాక్టర్లకే ఇచ్చినట్లు తెలుస్తున్నది. పైగా ఒక ఏడాదిలో ఒక కాంట్రాక్టరుకు రూ.13 కోట్ల చెల్లింపులు జరిగితే… చెల్లించిన బిల్లుల్లో కేవలం ముగ్గురు కాంట్రాక్టర్లకే 80 శాతానికి పైగా మొత్తం మళ్లించినట్లు సమాచారం.
చివరి నిమిషం దాకా హస్తంపైనే ఆశలు
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లోదాదాపు నెలన్నర, రెండు నెలలుగా ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్‌తో పాటు ఉన్నతాదికారులకు ఫిర్యాదులు సైతం పెద్ద ఎత్తున వెళ్లడంతో ఆదిలో అధికారులు కొంత భయపడ్డారు. కానీ తెర వెనక ఉన్న నేత ఏమీ కాదు… పైవాళ్లతో మాట్లాడుతున్నానని చెబుతుండటంతో అధికారులు మరింత రెచ్చిపోయారు. తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో తొలుత విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి కొన్ని ఫైల్స్‌ను స్వాధీనం చేసుకొని ఆపై విచారణను అటకెక్కించింది.
ఆతర్వాత అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగడంతో అక్రమాల పుట్ట ఒక్కసారిగా పగిలినట్లయింది. ఈ క్రమంలో విజిలెన్స్ తిరిగి విచారణను ముమ్మరం చేసి… ఎట్టకేలకు అవినీతి గుట్టును రట్టు చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు నివేదిక సమర్పించింది. ఈస్థాయి అవినీతిను సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ ఒకేసారి పది మందిపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారింది. మరోవైపు బడంగ్‌పేట వ్యవహారం రాజకీయంగానూ అధికార పార్టీలో కాక పుట్టిస్తున్నది.
ఈ అక్రమాలు వెనక ప్రధాన సూత్రధారి అధికార పార్టీకి చెందిన నేత అనే ఆరోపణలు వెల్లువెత్తడం… ఆ మేరకు పత్రికా కథనాలు రావడంతో నియోజకవర్గంలోని ఇతర నేతలు పలువురు పార్టీ రాష్ట్ర అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి కంపుతో ఒకవైపు ప్రభుత్వంపై ప్రజల్లో చెడ్డ పేరు రావడంతో పాటు నియోజకవర్గంలో పార్టీపరంగానూ వ్యతిరేకత వ్యక్తమవుతుందని సదరు నేతలు రాష్ట్ర నాయకులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా సమ్మయ్య
బడంగ్పేట్, ఏప్రిల్ 2: అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమ్మయ్యను బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఉత్వర్వులు జారీ చేశారు. బడంగ్పేట్ డీసీగా పనిచేసిన సరస్వతిపై అవినీతి అక్రమాల ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ.. సమ్మయ్యకు బాద్యతలు అప్పగించారు. గురువారం సమ్మయ్య బాధ్యతలు తీసుకున్నారు. సర్కిల్ సిబ్బంది ఆయనను సత్కరించి పూల బోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.