హయత్‌నగర్: కాంగ్రెస్ నేత కుమారుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు బర్రె రాజ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి కుంట్లూరు హరిజనవాడలో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్ కుమారుడు (15) కుంట్లూరులోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
అతడు తన తోటి విద్యార్థిని రితిక(15)ను ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం వెంబడిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. సదరు కాంగ్రెస్ నేత కుమారుడిని బాలిక తల్లిదండ్రులు మందలించినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మనస్తాపానికి గురైన రితిక.. గురువారం ఆత్మహత్య చేసుకుంది. కాగా, రాజ్‌కుమార్ బెదిరింపులకు భయపడి కూతురు మృతదేహాన్ని తల్లిదండ్రులు సొంతూరు నాగార్జున సాగర్హిల్కాలనీకి తీసుకెళ్లారు. బాలిక తల్లి కేశవ ఫోన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. రితిక మృతిగల కారణాలపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు తెలిపారు.