బడంగ్ పేట్, మే 7: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగి చెందిన పార్టీ నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆప్షన్ సభ్యులుగా, మాజీ ఉపసర్పంచ్గా పనిచేసిన పల్లె జంగయ్య గౌడ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు . ఆయనకు సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యకర్తలను కూడా పట్టించుకోకపోవడంతో ఆ పార్టీపై ఆరోపణలు చేస్తూ బయటికి వెళ్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారని ఆమె చెప్పారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు బలమైన నమ్మకం ఉండడంతోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు.