కంటోన్మెంట్: సెప్టెంబర్ 11: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డ్డు మడ్‌ఫోర్ట్ గాంధీనగర్‌లో రేకులషెడ్లు, గుడిసెల్లో ఉంటున్న పేదలకు ఏ నుంచి ఎఫ్ బ్లాక్ వరకు రెండు వందల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. ఇందులో 150 మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేయగా గృహప్రవేశం కూడా చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో స్థానికులు కొందరు తమకు తామే కమిటీగా ప్రకటించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రమేశ్ అధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్‌గా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోచయ్య, జాయింట్ సెక్రటరీగా బాల్‌రాజు, కమిటీ సభ్యులుగా విలాసిని, వసంత, నజ్మబేగం, షనరా బేగం, సంధ్య ఉన్నారు. కాగా ఇండ్ల నిర్మాణం జరిగిన తర్వాత కమిటీ సభ్యుల అరాచకాలు ప్రారంభమయ్యాయి. కాగా ఇండ్ల లబ్ధిదారులు కమిటీకి అరవై వేలు చెల్లించాల్సిందేనని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తాడ్బంద్లో నివాసం ఉండే షేక్ మెహర్జేహన్కు మడ్‌ఫోర్ట్ గాంధీనగర్ డబుల్బెడ్రూం బీ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ 7నంబర్ ఇంటిని అధికారులు ఇటీవల కేటాయించారు. ఖాళీగా ఉన్న ఈ ఇంటిని కొన్నేళ్లుగా అధ్యక్షుడు రమేశ్ తన ఆధీనంలో ఉంచుకుని అందులో కొంత సామాగ్రిని పెట్టాడు. తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతి ఆదేశాల మేరకు మెహర్జేహన్కు ఇంటిని అప్పగించాడు. ఆ తర్వాత కమిటీ సభ్యులు రూ.96 వేలు తమ కమిటీకి చెల్లించాలని లేని పక్షంలో ఇంటికి సరఫరా అయ్యే తాగునీటి సరఫరా నిలిపివేస్తామని, డ్రైనేజీ వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై సదరు మహిళ తిరుమలగిరితహసీల్దార్కు ఫిర్యాదు చేసింది.
కమిటీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ నేత రమేశ్ స్థానికంగా ఉండక పోవడం విశేషం. ఇతడి తల్లి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం బీ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంటి నంబర్ 8ను కేటాయించగా ఇటీవల పద్దెనిమిది లక్షలకు అమ్మినట్లు సమాచారం. ఇల్లు అమ్ముకుని స్థానికంగా లేకుండా బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న వ్యక్తి తమ డబుల్బెడ్రూం ఇండ్ల కమిటీకి ఏ విధంగా అధ్యక్షుడు అవుతాడని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా లేకున్నా తమ డిగ్నిటి హౌసింగ్ కాలనీలో అరాచకాలకు పాల్పడుతున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తనకు ఇంటిని కేటాయించగా కమిటీకి రూ.96 వేలు ఇవ్వాలని కమిటీ అధ్యక్షుడు రమేశ్‌తో పాటు సభ్యులు డిమాండ్ చేశారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తప్పనిసరి ఇవ్వాలని లేని పక్షంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగులైన పిల్లలతో రోజువారి పనిచేస్తూ కుటుంబం గడుపుతున్నామని డబ్బులు చెల్లించలేం. అధికారులు న్యాయం చేయాలి.
-షేక్ మెహర్జేహన్,లబ్ధిదారు