Hyderabad | కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడిన విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబంపై కాంగ్రెస్ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ పిల్లల తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై దొంగతనం కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన లీలావతి దంపతులు ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. మే 25వ తేదీన సాయంత్రం వారి ఇద్దరు కుమారులు మరికొంతమంది పిల్లలతో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడుకున్నారు. పిల్లలు ఆడుకోవడంపై అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నేత లుకస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయంపై అడగడానికి వెళ్లిన లీలావతిని లుకస్ తిడుతూ దాడికి దిగాడు. ఈ ఘటనలో లీలావతి దుస్తులు చినిగిపోయాయి. అయినా వదలకుండా లుకస్ దాడి చేశాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేశాడు.
కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
రాత్రివేళ దంపతుల్ని పోలీస్ స్టేషన్‌కు పంపించి వేధింపులకు గురిచేసి.. కాళ్లు మొక్కితేనే కేసు వాపస్ తీసుకుంటానని బెదిరింపు
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికార… pic.twitter.com/1zD9Hq8KZ5
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
అంతటితో ఆగకుండా అధికారమదంతో పోలీసులకు ఉల్టా కంప్లయింట్ స్టేషన్లో పెట్టించాడు. తమపైనే దాడి జరిగిందని బాధితులు చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులు వినిపించుకోలేదు. కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. ఇదిలా ఉంటే దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. దీంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లీలావతి కుటుంబంపై దొంగతనం కేసు పెట్టాడు.
దీంతో భయాందోళనకు గురైన దంపతులు తమపై చోరీ కేసు పెట్టవద్దని లుకస్ను వేడుకున్నారు. ఈ క్రమంలో కాళ్లు మొక్కి తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని లుకస్ బెదిరించాడు. గత్యంతం లేక పోలీసుల సమక్షంలోనే బాధితులు కాళ్లు మొక్కి వచ్చేశారు.