ఖైరతాబాద్, మే 1 : కులగణనలో దేశానికి తెలంగాణ ఆదర్శమని చెబుతున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సిగ్గుపడాల్సిన సందర్భమని వక్తలు అన్నారు. సోమాజిగూడలోని అఖిల భారత గాండ్ల తేలికుల సంఘం ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పాలూరు రామకృష్ణయ్యతో కలిసి మాట్లాడారు.
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లను తొక్కిపెడుతూ వస్తోందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కులగణన చేయలేదని, అది కాకుండా అడ్డుపడిందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అన్ని రంగాల్లో అది అమలు చేసే అవకాశం ఉందని, కాని కేంద్రంపై నెట్టివేస్తూ తప్పించుకునే కార్యక్రమానికి తెరలేపిందన్నారు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ వర్గాలకు తీరని మోసం చేస్తున్నారని, ప్రతి రంగంలో తన సామాజికవర్గానికి చెందిన వారిని నియమించుకుంటూ బీసీలను అణగదొక్కుతున్నారన్నారు. ఈ సమావేశంలో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ సంఘాల జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, రాష్ట్రీయ నారీ సమాజ్ అధ్యక్షురాలు పాలూరు లక్ష్మి, అఖిల భారత తేలికల సంఘం అధ్యక్షుడు శంకరయ్య, బీసీ నాయకులు చంద్రశేఖర్, నర్సయ్య, సైదాబేగం పాల్గొన్నారు.