రాహుల్ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?
రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలి
కార్మికుల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం
మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ భవన్లో ఘనంగా మే డే వేడుకలు
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): దేశంలో కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని, తెలంగాణకు రాహుల్‌గాంధీ వచ్చి ఏం చేస్తారని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మే డే వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని వ్యాఖ్యానించారు. కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టే ధర్నాలు, సమ్మెలు, నిరసనలు చేయకముందే సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వేతనాలు పెంచారని గుర్తు చేశారు. పరిశ్రమలకు పవర్ హాలీడేలు లేవని, కార్మికులకు కూలీ సమస్యే లేదని స్పష్టం చేశారు.
రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకొందామని, స్థానికంగా ఉన్న బీహెచ్ఈఎల్ ప్రైవేటుపరం కాకుండా పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. రాంబాబు యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి, కట్టెల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, ఈఎస్ఐ బోర్డు సభ్యుడు మారయ్య, టీఆర్ఎస్కేవీ నాయకులు పాల్గొన్నారు.