Bakka Judson | చిక్కడపల్లి : నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఫిబ్రవరి 3, 4 తేదీల్లో ఇందిపార్క్ ధర్నాచౌక్ వద్ద 48 గంటల పాటు నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయం ప్రాంగణంలో దీక్షకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రియాక గాంధీ,రాహుల్ గాంధీ ఇదే అశోక్‌నగర్ ప్రాంతంలో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారన్నారు. జాబ్ క్యాలెండర్ పెడుతామని.. 46 జీవోను రద్దు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. నిరుద్యోగులకు 4వేల భృతి ఇస్తామని.. ఇలా ఎన్నో అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎంకు స్పష్టత లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ను పొడిగిస్తున్నారని ఆరోపించారు. రిటైర్మెంట్ అయ్యే వారికి శరీరం సహకరించకున్నా.. చేతకాకపోయినా బలవంతంగా ప్రొఫెసర్లకు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ని పొడగించారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారందరికీ పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.25లక్షల కోట్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.4వేల కోట్లు నిధులతో కట్టాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని.. కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మనసొప్పదన్నారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో రూపాయికి భారానా కమిషన్లు వస్తాయని.. కాబట్టి ప్రభుత్వానికి దానిపై మాత్రమే దృష్టి ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే.. ఏమీ ఇవ్వలేరని.. అందుకే వారిపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే నిరుద్యోగ నీరహారదీక్షకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, అర్జున్, చందర్రావు, నర్సింహాచారి, యుగేంధర్ పాల్గొన్నారు.