వందల కోట్ల విలువైన భూములను చెరబట్టి.. ప్రజల నుంచి లాక్కోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు కుట్ర చేస్తున్నది. మూసీ సుందరీకరణ పేరును సాకుగా చూపుతూ ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకు అర్రులు చాస్తున్నది. మూసీ పరీవాహక ప్రజలను మభ్యపెట్టి, విభజించి, బెదిరింపులకు గురిచేసి.. తమ ఆస్తులను తామే ఇచ్చేవిధంగా కుటిల ప్రయత్నాలు చేస్తున్నది.
-సిటీబ్యూరో, బండ్లగూడ, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)
డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా, మూసీ నదికి స్పష్టమైన ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను నిర్దారించకుండా బాధిత ప్రజలకు నోటీసులు, భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నది. దశదిశ లేని ప్రాజెక్టుకు వందలాది ఎకరాల ప్రజల భూములను, ఆస్తులను తీసుకోవడానికి ముందే ఎందుకు కుట్రలు చేస్తున్నది. అదే అంశంపై మూసీ సుందరీకరణ ఫేజ్-1 బాపుఘాట్-గండిపేట, బాపుఘాట్-హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లోని భూబాధితులకు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అధికారులను ప్రశ్నించారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అభిప్రాయ సేకరణను బహిష్కరించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం, ఎంఆర్డీసీఎల్ అధికారులు ఒంటెద్దు పోకడ పోతున్నారని ఆరోపించారు. ముందుగా డీపీఆర్ బయట పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హిమాయత్‌సాగర్, హైదర్‌గూడ భూబాధితులను గురువారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో అభిప్రాయ సేకరణకు పిలిచారు. డీపీఆర్, బఫర్‌జోన్ పరిధిని ప్రకటించకుండా తమను ఎందు కు పిలిచారని నిలదీశారు. దీంతో అధికారులు సతమతమవుతూ.. ఎకరానికి రూ.1.4కోట్ల చొప్పున చదరపు గజానికి రూ.14 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఎకరానికి రూ.60 కోట్లున్న భూమికి రూ.1.4 కోట్లు ఏప్రాతిపదికన ఇస్తారంటూ నిలదీశారు. తాము కోల్పో యే భూమికి సమాన విలువ చేసే భూమి ని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలో సహకరించబోమని తెగేసి చెప్పారు.
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా ప్రజల ఆస్తులను అగ్గువకే లాక్కొనేందుకు చేస్తున్న కుట్రలను సహించబోమని స్పష్టంచేశారు. అధికారు లు, ప్రభుత్వానికి నచ్చినట్లు పరిహారం ఇస్తామంటే ఊరుకోబమన్నారు. ప్రజల ఆస్తులను ప్రాజెక్టుల పేరిట లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కు అండగా ఉండాల్సిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సర్కారుతో కుమ్మ క్కై భూములను అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం దిగొచ్చి భూమికి భూమి ఇస్తేనే సహకరిస్తామని తేల్చిచెప్పారు. లేదంటే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ క్రమంలో బాధితులకు అధికారులతో వాగ్వాదం చేయగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అమలు చేయలేని వాగ్ధ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారు. మూసీ సుందరీకరణ పేరిట భూములను సేకరించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మాకు గజానికి రూ. 14వేలు చెల్లిస్తే వంద కిలో మీటర్ల దూరం పోయినా ఆ ధరతో భూమి దొరకదు. ప్రభుత్వ భూములను కోట్లాది రూపాయలకు వేలం వేస్తున్నారు. కానీ ప్రజల ఆస్తులను మాత్రం అగ్గువకు గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారు. మా భూములను కూడా వేలం ద్వారానే తీసుకోవాలి. మూసీ నదికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న మా భూములను లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమికి బదులుగా భూమి ఇవ్వకుంటే మాకు ఆత్మహత్యలే దిక్కు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, గాంధీసరోవర్ అంటూ మూసీ పరీవాహక ప్రజలను అవస్థలు పెడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్‌గౌడ్‌ను గెలిపించి తప్పు చేశాం. మా బాధలను చెప్పుకొనేందుకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ దగ్గరకు వెళ్తే తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. కనీసం పరిహారమైనా బహిరంగ మార్కెట్ ప్రకారం ఇప్పించాలని వేడుకున్నాం. అంతా అయిపోయింది.. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని మోసం చేశారు. తగిన పరిహారం ఇప్పిస్తారనే ఆశతో ఆయన దగ్గరకు వెళ్తే తగిన గుణపాఠం చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భూమికి భూమి, బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తాం.
– ఆంజనేయులు, మాజీ సర్పంచ్, హిమాయత్‌సాగర్