సిటీ బ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్‌ను గాలికొదిలేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మహానగర అభివృద్ధిని అటకెక్కించింది. ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో హైదరాబాద్ ఊసే ఎత్తలేదు. హైదరాబాద్ పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్క మాట కూడా చెప్పలేదు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకు కొనసాగింపుగానే బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు చేసి మమా అనిపించారు. అందులో భాగంగానే జలమండలికి కూడా నామమాత్రపు కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నారు. జలమండలిని జీహెచ్ఎంసీకి సమాంతరంగా 2023 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించారు. ఆయా ప్రాంతాలకు ఈడీలను సైతం నియమించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా.. బడ్జెట్లో మాత్రం పరిధి పెరిగిన ప్రాంతంలో వనరులను సమకూర్చుకునేందుకు, అభివృద్ధి పనులకు బడ్జెట్లో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. విస్తరించకముందు మాదిరిగానే గతేడాది కంటే రూ.80 కోట్ల కోత విధించి జలమండలి అభివృద్ధిని అటకెక్కించారు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కొత్త ప్రాజెక్టులకు కేటాయించకుండా పాత వాటిని కొనసాగించేందుకు బడ్జెట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించారు. జలమండలి అధికారులు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు కావాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపితే అందులో సగం మాత్రమే కేటాయించారు. ఆ సగం నిధులు కూడా గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువేనని స్పష్టం అవుతున్నది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సగానికి పైగా మంజూరు చేయలేదు.. మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈసారైనా కేటాయించిన కొద్ది మొత్తాన్ని పూర్తిగా మంజూరు చేసి.. అభివృద్ధి పనులు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.
జలమండలి పరిధి విస్తరించినా బడ్జెట్ కేటాయింపులో మాత్రం కాంగ్రెస్ సర్కారు తగ్గుదలనే కొనసాగించింది. పరిధి విస్తరణను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం జలమండలి రూ.6 వేల కోట్లకు పైగా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా అసలు జలమండలి విస్తరణ జరగనే లేదనే రీతిలో బడ్జెట్ కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నది. గత బడ్జెట్లో కేటాయించిన రూ.3,385 కోట్లను కేటాయిస్తే ఈసారి రూ.80 కోట్లు తగ్గించి రూ.3,305 నిధులను కేటాయించింది. ఇప్పటికే రాబడి తగ్గి వ్యయం పెరగడంతో ఇబ్బందుల్లో ఊగిసలాడుతున్న జలమండలికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందనుకుంటే మరింత కిందకు దిగజారేలా వ్యవహరిస్తున్నది. ఓల్డ్ సిటీలో మురుగు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి గత బడ్జెట్లో రూ.1500 కోట్లను ప్రతిపాదిస్తే ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఈసారైనా కేటాయించి ఓల్డ్ సిటీ మురుగును పారదోలడానికి సహకరిస్తుందనుకుంటే పట్టించుకోలేదు. సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి గత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా పనులు చేపట్టకపోవడంతో ఈసారి అంతే మొత్తంలో కేటాయించింది. ఇక లోన్లు కట్టేందుకు రూ.800 కోట్లకు పైగా జలమండలి ప్రతిపాదనలు పంపగా కేవలం రూ.555 కోట్లతో సరిపెట్టింది. 20 కేఎల్ ఉచిత తాగునీటికి మాత్రం రూ.300 కోట్లు కేటాయించింది. అభివృద్ధి పనులకు మరో రూ.1450 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నది.
గత బడ్జెట్లో జలమండలి రూ.6 వేల కోట్లకు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపినా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.3,385 కోట్లను కేటాయించి మొండిచెయ్యి చూపింది. అందులో కేవలం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసింది. సుంకిశాల ఇన్‌టేక్ వెల్‌కు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు పనులు చేయకపోవడంతో ఖర్చు కాలేదు. ఈసారి గతం కంటే రూ.80 కోట్లు తగ్గించినా మొత్తం నిధులను విడుదల చేస్తే ఎంతో కొంత మేలు కలుగుతుందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా గండిపేట నుంచి కాన్డ్యూట్కు సమాంతరంగా నిర్మిస్తున్న పైపులైన్‌కు, గోదావరి ఫేజ్-2కు అభివృద్ధి పనులకు కేటాయించిన రూ.1450 కోట్ల నుంచే తీసుకునేలా బడ్జెట్ రూపొందించారు. ఆ డబ్బు నుంచే పెరిగిన పరిధిలో నీటి కనెక్షన్ల వ్యవస్థను పునరుద్ధరించడం, కొత్త వ్యవస్థను రూపొందించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతం మాదిరిగా కాకుండా కేటాయించిన మొత్తం నిధులను విడుదల చేస్తే గుడ్డిలో మెల్ల లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.