‘హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం’…బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటీ పట్టాలెక్కలేదు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హెచ్ సిటీ’ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది. గత ప్రభుత్వ పథకాల పేర్లను విజయవంతంగా మార్చేసిన ప్రభుత్వం.. హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై ఆ స్థాయి ఫోకస్ పెట్టలేకపోయింది. ఫలితంగా జీహెచ్ఎంసీలో అభివృద్ధి కుంటుపడింది. గడిచిన 10 నెలలకు పైగా ఒక్క కొత్త ప్రాజెక్టూ ముందడుగు పడకపోవడం గమనార్హం.
-సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ)
GHMC | కాంగ్రెస్ సర్కారు హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా నాలాల అభివృద్ధి రెండో దశ పనులకు రూ. 458 కోట్లతో 29 చోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించి టెండర్లు పిలవగా..ఇందులో కేవలం తొమ్మిది ప్రాంతాల్లో పనులు మొదలు కావడం, ఇవి కాస్తా ఒక్కొక్కటీ రూ. 5 కోట్ల లోపు మాత్రమే. అలాగే ఎన్ఆర్డీపీ స్థానంలో హెచ్ సిటీ కింద కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 826 కోట్లతో ఆరు కూడళ్లలో రెండు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించి, ఈ ప్రతిపాదనలను పరిపాలన అనుమతులతోనే సరిపెట్టారు. వీటికి నిధులు మంజూరుపై స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంవత్సరంలో రెండు టర్మ్‌లు ముగిసినా.. ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి చిల్లి గవ్వ ఇవ్వలేదు.
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వాయు వేగంతో 37 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టి చాలా ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేసింది. ఏటా రూ. 600-700 కోట్ల మేర నిధులను ఖర్చు చేసి ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు వరద నీటికి శాశ్వత పరిష్కారంగా ఎస్ఎన్డీపీ పథకాన్ని తీసుకువచ్చి రూ.985.45కోట్లతో చేపట్టిన మొదటి విడత పనులు రూ.592.68కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను పూర్తి చేసింది.
గుంతలు లేని రహదారులే లక్ష్యంగా సీఆర్ఎంపీ పథకాన్ని రూ. 900కోట్లతో చేపట్టి ఆదర్శవంతమైన పథకంగా మార్చింది. అయితే ఈ మూడు కీలక ప్రాజెక్టులకు గత సర్కారు రెండో దశ ప్రతిపాదనలతో సిద్ధమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఈ పథకాల స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టుగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్న రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనకు హెచ్ సిటీ కింద కేవలం రూ. రూ.2675.35 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులను ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతున్నది.
ఇప్పటికే రూ. 1400కోట్లకు పైగా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో బకాయిపడింది. వీటిని చెల్లిస్తేనే పనులు జరుపుతామని కాంట్రాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కొత్త పనులపై కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తరచూ టెండర్లను ఆహ్వానిస్తూ వస్తున్నారు. మొత్తంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు కొత్తవి ప్రారంభం కాకపోవడం, పురోగతి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం, నాలా పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా అటు ట్రాఫిక్, ఇటు వరద ముంపు సమస్యలు తప్పడం లేదు. నామమాత్రంగా జంక్షన్ల అభివృద్ధి, సీసీ రోడ్ల పనులు తప్ప.. కీలకమైన ప్రాజెక్టులు ఒక్కటీ ముందడుగు పడటం లేదు.