Auto Drivers | సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడో రోజు ఆటో డ్రైవర్లు భిక్షాటన చేపట్టారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమ ఉపాధిని దెబ్బతీసి.. తమ బతుకులు రోడ్డు కీడ్చిందంటూ ప్రజల వద్ద భిక్షమెత్తుకున్నారు. ఆట, పాటలు, దరువు వేస్తూ కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత హామీలను ఎండగట్టారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను లూటీ చేస్తున్నారని జేఏసీ ప్రతినిధులు ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ పాలనలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈనెల 21న నిర్వహించే మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరూ తరలి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఆటో యూనియన్ గ్రేటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి యన్.కిషన్, టీఆర్ఏకేటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లర్ల రవి, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి, బీపీటీఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమ్మయ్య యాదవ్, టీఏడీయూ అధ్యక్షుడు కొమరయ్య పాల్గొన్నారు.