Runa Mafi | మేడ్చల్, జనవరి 29: ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీకి నోచుకోని ఎంతో మంది రైతులు ఉన్నారు. తమకెందుకు రుణమాఫీ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలంలో మూడు సహకార సంఘాల పరిధిలో అరకొర రుణమాఫీ జరిగింది. మండలంలో మేడ్చల్, డబిల్పూర్, పూడూరు వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి.
మేడ్చల్ సంఘం పరిధిలో రుణమాఫీకి 524 మంది అర్హత గల రైతులు ఉంటే కేవలం 398 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 126 మందికి మాఫీ జరగాల్సి ఉంది. డబిల్పూర్ సహకార సంఘ పరిధిలో 661 మంది రైతులకు గాను 340 మందికి మాత్రమే మాఫీ జరిగింది. అంతేగాకుండా ఎస్బీఐ డబిల్పూర్ శాఖలో రుణం పొందిన రైతుల్లో 550 మంది రైతులకు గాను 150 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. ఇంకా 400 మందికి మాఫీ కావాల్సినట్టు సమాచారం. పూడూరు సహకార సంఘ పరిధిలోని 1400 మంది మాఫీకి అర్హుత ఉండగా అతి తక్కువగా 254 మందికి మాత్రమే జరిగింది. ఇంకా 1146 మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది.
అడిషనల్ కలెక్టర్‌కు వినతి
సహకార సంఘాల చైర్మన్లు మూడు సహకార సంఘాల పరిధిలో ఉన్న అర్హుల జాబితాను రూపొందించి బుధవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టరేట్ విజయేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అర్హులకు రుణమాఫీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇంత మందికి మాఫీ కాలేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీఎస్సీఏబీ (తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్)కు రాసి పంపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సహకార సంఘాల చైర్మన్లు రణదీప్‌రెడ్డి, సద్ది సురేశ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, డైరెక్టర్లు మధుసూదన్‌రెడ్డి, మధు, దేవేందర్‌రెడ్డి, బ్రహ్మానందారెడ్డి, భూపాల్, చిన్నోళ్ల సంజీవ, సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.