సిటీబ్యూరో: ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. సకాలంలో వేతనాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎంట్రీ చేసే డెలివరీ ఎంట్రీ ఆపరేటర్లకు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి అద్దెలు కట్టేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా కృషి చేసింది. అందులో భాగంగానే 2017 జూన్ 2న ప్లేట్ల బురుజు ఆసుపత్రి కేంద్రంగా కేసీఆర్ కిట్ పథకాన్ని స్వయంగా నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వ అసుపత్రుల్లో ప్రసవించే వారికి రూ. 2000 విలువ చేసే కేసీఆర్ కిట్‌లో తల్లి, శిశువులకు చెందిన 16 రకాల వస్తువులతో పాటు మగపిల్లవాడు జన్మిస్తే రూ.12000, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13000 గత సర్కారు చెల్లించింది. దీనివల్ల ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేసీఆర్ కిట్ అందించడంలో డీఈవోలు ప్రముఖ పాత్ర పోషించారు.
పొరుగుసేవల ప్రాతిపదికన నియమించబడ్డ ఈ ఉద్యోగులంతా ప్రసవాలు నమోదు చేయడం, కిట్ వివరాలు లబ్ధిదారులకు వివరించడం, టీకాలు, నెలనెలా చెకప్‌లు వంటి పనులు నిర్వహించడంలో నిరంతరం కష్టపడ్డారు. గత ప్రభుత్వంలో ఎంతో మెరుగ్గా పని చేసిన వీరంతా నేడు వేతనాలందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది డీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ. 36 లక్షలు వేతనాలకోసమని ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. అయితే గత నాలుగు నెలల నుంచి డీఈవోలకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఈవోలకు నాలుగు నెలలనుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా ఇంటిఅద్దెలు, ఈఎంఐలు, పిల్లల బడి ఫీజులు కట్టలేక, నిత్యావసరాలు కొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రభుత్వం దయతలచి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ వేడుకుంటున్నారు.
‘వేతనాలందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే చాలా సార్లు తీసుకెళ్లాం. అయినా ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. చిరు ఉద్యోగుల పొట్టకొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు’. అని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు.