మేడ్చల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లను కుట్టిన మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూలీ డబ్బులను అందజేయలేదు. దీంతో స్వయం సహాయక మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని 507 ప్రభుత్వ పాఠశాలల్లో 89,605 మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్‌లను కుట్టి అందజేయాలని మహిళా సంఘాలకు గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వం ఆదేశించింది.
అనుకున్న సమయానికే విద్యార్థులకు యూనిఫామ్‌లు కుట్టి అందించి ఏడు నెలలు గడిచినా.. తమకు రావాల్సిన రూ.88 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు మహిళా సంఘాలు సభ్యులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 507 ప్రభుత్వ పాఠశాలలో 44,184 మంది బాలురు, 45, 340 బాలికలు ఉండగా, వారికి అవసరమయ్యే వస్ర్తాలు(క్లాత్)ను ప్రభుత్వం అందించింది.
మహిళా సంఘాల ద్వారా 23 కుట్టు సెంటర్లను ఏర్పాటు చేసి 1200 మంది మహిళలు తక్కువ ధరకు కుట్టేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకున్నది. మొదటి విడతలో రూ.44 లక్షలు చెల్లించినప్పటికీ రెండో విడతలో మరో రూ.88 లక్షలు చెల్లిస్తామని చెప్పి ఏడు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు డబ్బులు అందలేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు.