సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ చుట్టూరా శాటిలైట్ టౌన్‌షిప్పులను నిర్మిస్తాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అవసరమైతే నలువైపులా నగరాన్ని ప్రత్యేక జోన్లుగా నిర్ధారించి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాలను ప్రోత్సహిస్తూ నగరం రూపురేఖలు మార్చేస్తామంటూ’ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుంది. ప్రణాళికబద్ధమైన పట్టణీకరణకు గండికొట్టేలా పట్టాలెక్కిన శాటిలైట్ టౌన్షిప్ ప్రతిపాదనలను హెచ్ఎండీఏ అటకెక్కించేలా వ్యవహారిస్తోంది. విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను నీరుగారేలా చేస్తోందనివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 11 జిల్లాలకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వ్యాప్తంగా ప్రణాళికబద్ధమైన పట్టణీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్ పాలసీని ఆధునీకరించింది. విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకుని.. కోర్ సిటీ, ఔటర్ రింగు రోడ్డు మధ్య ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ, భూముల ధరలు, పారిశ్రామిక, జనావాసాలు, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా శాటిలైట్ టౌన్షిప్ పాలసీపై కసరత్తు చేసింది. అయితే తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఉన్న ప్రతిపాదనలు పక్కన పెట్టి.. ఊహానగరికి ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సమావేశాల్లో విశ్వనగరానికి శాటిలైట్ టౌన్షిప్ కంటే ముందుగానే ఫోర్త్ సిటీ అవసరం అన్నట్లుగా ప్రకటించారు.
10వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో… పెరుగుతున్న జనాభా, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు, ఇండస్ట్రియల్ జోన్లు, రెసిడెన్షియల్‌కు అనువుగా ఉండేలా శాటిలైట్ టౌన్షిప్లకు గత ప్రభుత్వంలోనే బీజం పడింది. కానీ ఆ ప్రణాళికలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతోంది. ముఖ్యంగా శాటిలైట్ టౌన్షిప్లకు అవసరమైన భూముల సేకరణ, సమీకరణలపై హెచ్ఎండీఏలో ఉన్న ఇబ్బందులను ఇప్పటికీ తొలగించలేదు. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లోనే ఉన్న ల్యాండ్ ఫూలింగ్ విధానాలను ఇప్పటికీ సులభతరం చేయలేదు.శాటిలైట్ టౌన్షిప్లకు అనువుగా విధానాలను మార్చాల్సి ఉన్నా ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. ఇక 2050 మాస్టర్ ప్లాన్ పేరిట హెచ్ఎండీఏ కాలయాపన చేస్తూనే ఉంది. జోన్లవారీగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, కొత్తగా ఎకనామికల్ జోన్లను నిర్మిస్తామంటూ శాటిలైట్ టౌన్షిప్ విధివిధానాలను హెచ్ఎండీఏ నీరుగారుస్తూనే ఉంది.
సమగ్రమైన శాటిలైట్ టౌన్షిప్ విధివిధానాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఔటర్ దాటి శరవేగంగా విస్తరిస్తున్న నగరానికి భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా అతిపెద్ద సమస్యగా మారనుంది. విస్తరిస్తున్న జనావాసాలపై నియంత్రణ లేకపోతే .. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, మౌలిక వసతులు లేని ప్రాంతాలుగా కొత్తగా ఏర్పడే కాలనీలు మారిపోతాయి. అదేవిధంగా శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం జరగకపోతే కోర్‌సిటీకి రాకపోకలు పెరిగి ఢిల్లీ తరహా కాలుష్య సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఉండే ఇండ్లకు అవకాశమే ఉండదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నగరంలో ఆఫర్డబుల్ హౌజింగ్ మార్కెట్ పడిపోయినా… హై ఎండ్ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇలాగే కొనసాగితే నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఖరీదుగా మారి, సామాన్యుడు సొంతింటి కలలను కూడా సాకారం చేసుకునే వీలు ఉండదు.