సిటీబ్యూరో, డిసెంబర్30 (నమస్తే తెలంగాణ) : చెరువుల పరిరక్షణ పేరిట పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అవే చెరువులను అభివృద్ధి పనుల కోసం భ్రష్టు పటిస్తున్నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వందేండ్ల చరిత్ర కలిగిన మీరాలం చెరువును నిర్వీర్యం చేస్తున్నది. ఒక మీటరో రెండు మీటర్లో కాదు ఏకంగా 2.5కిలోమీటర్ల మేర పొడవునా వంతెన కోసం పూడ్చివేస్తున్నది. మీరాలం చెరువుకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో అభివృద్ధి పనుల పేరిట వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న జలావరణాన్ని చెల్లాచెదురు చేసే బాగోతాలకు తెరలేపింది. చెరువుల పరిరక్షణ కోసం ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, భావితరాలకు వాటిని అందించేలా వాటిని ఆధునీకరిస్తామని చెప్పి..ఇప్పుడు చెరువుల్లో నిర్మాణాల కోసం పూడ్చివేతలకు దిగుతున్నది. రెండున్నర కిలోమీటర్ల పొడవైనా వంతెన నిర్మించేందుకు మీరాలం చెరువును రెండుగా చీల్చుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఐకానిక్ కట్టడంలా మారింది. రెండు పిల్లర్ల సాయంతోనే నిలబడే ఈ కట్టడంతో చెరువుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దీని ద్వారా నిత్యం వేలాది వాహనాలు కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్‌కు ప్రయాణిస్తున్నా జలవనరులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిర్మాణం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చేంత వరకు అధునాతన సాంకేతికతను వినియోగించి జలావరణాన్ని పరిరక్షించారు. కానీ కేబుల్ బ్రిడ్జి తరహాలో నిర్మాణం చేపడుతామని చెప్పి.. ఏకంగా మీరాలం చెరువును పూడ్చివేస్తున్నారు. భారీ వాహనాల్లో మట్టిని తరలించి చెరువులో నింపుతున్నారు. ఇక పిల్లర్ల కోసం చెరువులోనే భారీ గుంతలు తవ్వుతున్నారు. 2.5 కిలోమీటర్ల పొడువునా నిర్మించే బ్రిడ్జి కోసం 300 మీటర్లకు ఒక పిల్లర్ చొప్పున ఐదారు పిల్లర్లను చెరువు మధ్యలోనే నిర్మించేలా ప్రణాళికలు చేస్తున్నారు.
నగరంలో చెరువులను చెరబడుతున్న సర్కారు.. పేదల ఇండ్లను కూల్చివేసింది. హైడ్రా సాయంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసితులను భయభ్రాంతులకు గురిచేసిన సర్కారు.. ఇప్పుడు అభివృద్ధి పేరిట మీరాలం చెరువును కనుమరుగు చేసేలా కార్యాచరణను ప్రణాళిక బద్ధంగా చేపడుతుంది. చెరువుల అభివృద్ధి పేరిట పూడ్చివేస్తోంది. చింతల్మేట్ నుంచి నేరుగా బహుదూర్‌పల్లి జాతీయ రహదారిను కలుపుతూ భారీ వంతెనతో వంద ఎకరాల్లో విస్తరించిన చెరువుకు ప్రమాదం పొంచి ఉంది.
నిజాం కాలంలో హైదరాబాద్ నగరవాసులకు తాగునీరు అందించిన మీరాలం చెరువు… జనసంచారంతో పదుల ఎకరాల్లో అన్యాక్రాంతానికి గురైంది. ముఖ్యంగా ఇన్లెట్, అవుట్ లెట్లను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. పక్కనే ఉన్న జూ పార్క్‌తో జీవావరణం కొనసాగుతుంది. కానీ ఇలాంటి నిర్మాణాలతో చారిత్రక చెరువు రానున్న రోజుల్లో కనుమరుగయ్యే మిగతా
ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మీరాలం చెరువు బ్రిడ్జితో రవాణా సదుపాయం మెరుగుపడినా.. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉండే జలావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
చెరువుపై నిర్మిస్తున్న ఈ వంతెన కోసం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని తెలుస్తుంది. దీనిపై మూసీ అధికారులను సంప్రదించిన స్పందించ లేదు. కనీసం సంబంధిత నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే ప్రభుత్వంలోని బడా నేత అండదండలతో కాంట్రాక్టును దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నా నేపథ్యంలో.. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే రూ. 320 కోట్ల భారీ నిర్మాణాన్ని చేపడుతున్నా పర్యావరణ శాఖ పట్టించుకోవడంలేదు. నిజానికి పర్యావరణ అనుమతులు రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. కానీ ఇక్కడ అవేవి లేకుండా ఎలా ప్రాజెక్టును చేపడుతున్నారనేది ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది.
అత్తాపూర్ నుంచి బహుదూర్‌పురా వెళ్లేందుకు ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే జాతీయ రహదారిని కలుపుతూ ప్రస్తుతం అత్తాపూర్, రాంబాగ్, సులేమాన్ నగర్, పహాడి మీదుగా రహదారి ఉంది. వీటిని విస్తరించిన ఈ ప్రాంతంలో రవాణా మెరుగుపడుతుంది. కానీ సర్కారు గత ప్రభుత్వం చేసిన డిజైన్లను మార్చి.. నేరుగా చెరువు మధ్యలోనే భారీ గుంతలను తవ్వి, పిల్లర్లతో వంతెన నిర్మాణంతో చెరువుకు ప్రమాదకరంగా మారనుంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మీరాలం చెరువులో అడ్డగోలు నిర్మాణాలపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తూ మట్టి నింపడం, భారీ పిల్లర్లను నిర్మిస్తే చెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోతున్నారు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలి అభివృద్ధి పనుల కోసం చట్టాలను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, చారిత్రక చెరువుకు జీవం లేకుండా చేస్తుందని ఆరోపించారు.
శాస్త్రీయ విధానాలను పక్కన పెట్టి, కేవలం నిర్మాణ పనులే లక్ష్యంగా ప్రభుత్వం పనులు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరాలం లేక్‌పై నిర్మిస్తున్న వంతెన ఇప్పుడొక వివాదస్పద నిర్మాణంగా మారుతుంది. పర్యావరణ నిబంధనలు గాలికొదిలి, కేవలం బ్రిడ్జి నిర్మాణం జరిగితే చాలన్నట్లుగా చెరువులో భారీ మొత్తంలో మట్టి నింపడంపై పర్యావరణ, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెద్ద ఎత్తున్న భవన మట్టి నింపి, 200-500 మీటర్ల పొడవునా రోడ్డు మార్గాన్ని మీరాలం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మూసీ అభివృద్ధి సంస్థ యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ, సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు.