అమీర్‌పేట్, నవంబర్ 2 : ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించడమే వారు చేసిన పాపమైంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నిజమని నమ్మి మోసపోయాం.. ‘మాలాగ మీరు మోసపోవద్దని.. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే బూటకపు హామీలు నమ్మొద్దంటూ ప్రజలను చైతన్యం చేసేందుకు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు సింధూజ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆదివారం ఎర్రగడ్డ శాస్త్రీనగర్‌లోని హనుమాన్ దేవాలయం ఎదుట స్థానికులకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు దేవేందర్‌రెడ్డి తన అనుచరులతో దేవాలయ పరిసరాలకు చేరుకుని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులను అడ్డుకున్నారు. వారిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నట్లు ఆరోపించారు. సింధూజతో పాటు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు బాలకోటి, రవికుమార్‌లపై కాంగ్రెస్ నాయకులు చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.
సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు..
తమపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిపై నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని దుర్భాషలాడారని సింధూజ సనత్‌నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులపై దాడి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, రాకేష్‌రెడ్డి, బీఆర్ఎస్వీ సీనియర్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు సనత్‌నగర్ పీఎస్‌కు చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర: ఎమ్మెల్యే మాధవరం..
సనత్‌నగర్ పీఎస్ పరిధిలోకి వచ్చే ఎర్రగడ్డ డివిజన్లోని ప్రాంతాల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలు సాగుతున్నాయని, వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలను కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యంగా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే బాధ్యులుగా గుర్తించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సనత్‌నగర్ పోలీసులు కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులు సమర్పించిన వీడియోల ఆధారంగా దౌర్జన్యానికి దిగిన వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.