ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ దింపుడు కల్ల్లెం ఆశలు గల్లంతయ్యాయని.. 4న జరగాల్సిన ఎన్నికను ఆపేందుకు ఆ పార్టీ కౌన్సిలర్లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిందని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16న జరగాల్సిన ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆ నెల 17కు పోస్ట్‌పోన్ చేయించారని.. అలాగే, 17న కౌన్సిలర్లందరూ హాజరైనా బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ యాదగిరిని కోర్టులో హాజరు పర్చాలన్న సాకుతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు.
కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలతో పట్నం చైర్మన్ ఎన్నికను మరోసారి ఆపాలనే దురుద్దేశంతో ఆ పార్టీ కౌన్సిలర్లతో గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయించగా.. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపట్టడంతో.. ఎన్నికను సజావుగా జరిపించాలని తీర్పును వెల్లడిస్తూ.. కాంగ్రెస్ కౌన్సిలర్లు వేసిన పిటిషన్‌ను కొట్టేసిందని.. దీంతో శనివారం ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యిందని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.