బడంగ్‌పేట, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ బాలునాయక్ బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న అంశాలను కార్పొరేటర్లు, ప్రజలు గమనిస్తున్నారన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి చూసి కండ్లు లేని కబోదులా వ్యవహరిస్తూ కొంత మంది వ్యక్తిగత విషయాల్లో తల దూర్చుతున్నారన్నారు. అలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మంత్రి ద్వారానే అభివృద్ధి సాధ్యం
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికే సాధ్యం అవుతుందని కార్పొరేటర్ బాలు అన్నారు. తన డివిజన్ అభివృద్ధి కావాలంటే మంత్రి సబితారెడ్డి ద్వారానే అవుతుందని గ్రహించి బీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. తనతోపాటు చాలా మంది బీఆర్ఎస్లో చేరడం జరిగిందన్నారు. తన డివిజన్లో చాలా మంది బీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ గూటికి వస్తారన్నారు. కార్పొరేటర్ బాలు నాయక్ బాటలోనే మరికొంత మంది కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ అర్జున్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నిమ్మల నరేందర్‌గౌడ్, కోఆప్షన్ సభ్యులు ఎస్.కె.ఖలీల్ పాషా, గుండోజి రఘునందన్ చారి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొర్ర జగన్‌రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, అత్తాపురం శ్రీనివాస్‌రెడ్డి, బొర్ర మాధవరెడ్డి, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.