ఎల్బీనగర్, మే 2 : కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ను అక్కడి నుంచి తరలించి చైతన్యపురి వికాస్నగర్కాలనీలోని మీ సేవా కేంద్రానికి మార్చి, మీ సేవా కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్‌కు తరలించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను కాలనీల వాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి అడ్డుకున్నారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ కోసం టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోనే సుమారు రెండు వేల గజాల స్థలాన్ని కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆ అంశాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి పోలీస్‌స్టేషన్‌ను అక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేయడంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. తొలుత చైతన్యపురి ప్రభాత్నగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయాలని తెలుపగా అందుకు కాలనీవాసులు అడ్డుతగలడంతో మిన్నకుండిపోయిన అధికారులు తాజాగా పోలీస్‌స్టేషన్‌ను చైతన్యపురి వికాస్‌నగర్ కాలనీలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
ఈ వార్డు కార్యాలయం భవనంలో మొదటి అంతస్తులో మీ సేవా కేంద్రం, రెండో అంతస్తులో గ్రంథాలయం కొనసాగుతుంది. ఈ రెండింటిలో మీ సేవా కేంద్రాన్ని స్థానిక న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌కు మార్చి మీ సేవా భవనాన్ని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు కేటాయించేందుకు రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండు రోజులుగా వీరి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మీ సేవా కేంద్రాన్ని ఈ భవనంలో నుంచి తరలించే యత్నం చేయడంతో పాటుగా మీ సేవా కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక కాలనీల వాసులు వ్యతిరేకిస్తున్నారు.
వీరంతా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఆశ్రయించగా ఆయన నేరుగా న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్ వద్దకు చేరుకుని సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌ను పిలిపించి న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్‌ను మీ సేవాకు కేటాయించేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. అదే విధంగా వికాస్‌నగర్ మీ సేవా కేంద్రానికి చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని తరలించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు చేస్తున్న యత్నాలను అడ్డుకున్నారు. మీ సేవా భవనంలోకి ఎవ్వరిని రానిచ్చేది లేదని పేర్కొంటూ భవనం ప్రధాన గేటుకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తాళం వేశారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, మీ సేవా కమిషనర్ రవికిరణ్‌తో ఫోన్లో మాట్లాడి ఈ కేంద్రాన్ని తరలించవద్దంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు ఆలోచనలతో చేస్తున్న పోలీస్‌స్టేషన్ తరలింపు పక్రియను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కాలనీవాసులందరికీ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, యువ నాయకుడు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ కోతి నర్సిరెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షుడు పవన్, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీవాసులు సుష్మిత,రోజా పద్మిని, భవానీనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వికాస్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు శోభారాణి, సంతోష్, తులసి, కృష్ణ, గట్టు శ్రీనివాస్, రమణారెడ్డి, జలందర్, నరేశ్, కిరణ్, శ్రీధర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు ఆలోచనతోనే చైతన్యపురి పోలీస్‌స్టేషన్ తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సేవా కేంద్రాన్ని వికాస్‌నగర్ వార్డు కార్యాలయం నుంచి తరలించే పక్రియను అడ్డుకున్న అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తపేటలో పండ్ల మార్కెట్‌ను తరలించి టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కోసం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సమయంలో ఈ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారిన నేపథ్యంలో భవిష్యత్తులో స్థలాలు దొరకని నేపథ్యంలో టిమ్స్ ప్రాంగణంలోనే రిజర్వాయర్, పోలీస్‌స్టేషన్, సబ్‌స్టేషన్, పార్కు, దేవాలయం, మజీద్ తదితరాల కోసం స్థలాన్ని కేటాయించాలని తాను కోరిన వెంటనే పెద్ద మనస్సుతో కేసీఆర్ రెండు ఎకరాలను కేటాయించి 2023 మే 5న జీవో విడుదల చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ పేరును కేసీఆర్ ఆనవాళ్లను తూడిచేయాలన్న మూర్ణపు ఆలోచనతోనే జీవోను రద్దు చేసి ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌ను ఆ ప్రాంగణం నుంచి తరలించేందుకు చూస్తున్నారని విమర్శించారు. టిమ్స్ ప్రాంగణంలోనే మూడు వేల గజాల స్థలంలో అధునాతన హంగులతో నిర్మాణం కావాల్సిన పోలీస్‌స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో కమ్యూనిటీ హళ్లు, మీ సేవా కేంద్రాలు ఉన్న భవనాలను వెతుక్కోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలోనే పోలీస్‌స్టేషన్‌ను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
టిమ్స్ ప్రాంగణంలో మెడికల్ కాలేజీ కోసం అంటూ పేర్కొంటున్న అధికారులకు తాను మరో స్థలాన్ని సర్వేనంబర్లతో సహా చూపించానని, మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పగా కలెక్టర్ కూడా ఆ స్థలం కోసం వివరాలు ఇవ్వాలని తనకు ఫోన్ చేశారని, అన్ని వివరాలు ఇచ్చిన ఉలుకు, పలుకు లేకుండా మిన్నకుండిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ ప్రజలకు అవసరమేఅని అయితే ప్రజల అవసరం కోసం ఉన్న అన్ని హంగులతో ఉన్న వికాస్‌నగర్ మీ సేవా కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని తరలించి అక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కమ్యూనిటీ హాళ్లలోనూ ఇలా ఏర్పాటుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడతామని ఆయన హెచ్చరించారు.