 
                                                            హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో వెనుకపడిపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నది. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు (Maganti Sunitha) జూబ్లీహిల్స్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సానుభూతితోపాటు, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తుండటంతో ఉపఎన్నికలో సునీత గెలుపు ఖాయమనే వాదన వినిపిస్తున్నది.
ఇక ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ మంత్రులు, నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రెండేండ్లలో తమకు ఏమి చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్‌యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వెంకట్‌యాదవ్ కూడా బెదిరింపులకు దిగారు. వెంగళరావునగర్ పరిధిలోని వికాస్పూర్లో ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన నిల్చున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు అనుచరులపై గూండాగిరీ చేశారు. ‘ఎవర్రా మీరు ఇక్కడ నిలబడ్డరు? ఎక్కడి నుంచో వచ్చిన …కొడుకులు ఇక్కడ ప్రచారం చేస్తార్రా? రేపటి నుంచి ఒక్కడు కూడా ఇక్కడ కనపడొద్దు. కనిపిస్తే చంపేస్తాం … కొడుకుల్లారా.బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తే ఒక్కొక్కడ్ని ఏసేస్తం’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్‌యాదవ్ ఊగిపోయారు.
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని బూతులతో విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తున్నది. నవీన్‌యాదవ్ మీడియా ముఖంగా బెదిరింపులకు పాల్పడుతుండగా, ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీలు మంచోళ్లు, పంచాయితీలు సెటిల్ చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్ ఏకంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. కార్యకర్తల మెడల నుంచి కండువాలు గుంజుకుని జులుం ప్రదర్శించారు. ప్రచారం చేస్తే బతకనీయనంటూ బెదిరించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై రౌడీయిజం ప్రదర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు (RO) కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
                            