బంజారాహిల్స్,అక్టోబర్ 17: తన చేతిలో రూ.6లక్షల నగదు, తనపై ఏడు క్రిమినల్ కేసులతో పాటు రూ.35 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.4లక్షల నగదు, భార్య వర్షాయాదవ్ చేతిలో రూ.2లక్షల నగదు ఉందని, ఐదు బ్యాంక్ అకౌంట్లలో కలిపి రూ.37.6లక్షల నిల్వ, తన భార్య వర్షాయాదవ్కు చెందిన రెండు అకౌంట్లలో రూ.10వేలు ఉందన్నారు.
దీంతో పాటు రూ.7లక్షల విలువైన షేర్లున్నాయని, తనకు స్కోడా కారుతో పాటు భార్య పేరిట ఐ 10 కారు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య వర్షాయాదవ్కు 2కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయని, తనవద్ద 11తులాల బంగారం ఉందని తెలిపారు. తన పేరుతో సంగారెడ్డి జిల్లా ఏదుల నాగులపల్లి, కర్దానూర్ ప్రాంతాల్లో 14.39 ఎకరాల వ్యవసాయభూమి, భార్య పేరుతో 4.30 ఎకరాల స్థలం ఉందని పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో ఇండ్లు, భార్యపేరుతో తుర్కలపల్లి, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం స్థిరాస్థుల విలువ రూ.35కోట్లుగా ఉందని తెలిపారు.